
గోదావరి జలాలకు హారతి
కల్లూరు/కల్లూరురూరల్: వర్షాభావ పరిస్థితులు, సాగర్ జలాల విడుదలలో జాప్యంతో పంటలు ఎండిపోతున్న నేపథ్యాన సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు మంగళవారం కల్లూరు మండలానికి చేరాయి. ఏన్కూరు మండలంలోని లింక్ కెనాల్ నుంచి సాగర్ కాల్వల్లోకి విడుదల చేసిన నీటిలో 500 క్యూసెక్కుల మేర కల్లూరు మండలంలోని కప్పలబంధం 73వ కి.మీ. రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నాయి. ఆపై మధిర బ్రాంచ్ కెనాల్‌తో పాటు పుణ్యపురం మేజర్, మైనర్ కాల్వలకు విడుదల చేశారు. ఈనేపథ్యాన కప్పలబంధం రెగ్యులేటరీ వద్ద కాంగ్రెస్ నాయకులు, రైతులు పూజలు చేశారు. గోదావరి జలాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసుమర్తి చందర్‌రావు, బంకా బాబు, ఎస్.కే.యాకూబ్ అలీ, దామాల రాజు, యాసా శ్రీకాంత్, పాపబత్తిని నగేష్, కళ్యాణపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.