
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
సత్తుపల్లిటౌన్: కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం సిద్ధారానికి చెందిన గోళ్లపూడి గోపి, కాకర్లపల్లికి చెందిన దుర్గాభవాని(30) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, గర్భసంచి సమస్యతో బాధపడుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మోతాదులో మింగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. దుర్గాభవాని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన గుగులోతు సైదులు(37) మంగళవారం ఖమ్మం రాగా, జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటే క్రమాన వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
పల్టీ కొట్టిన కారు: తప్పిన ప్రమాదం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెం రోడ్డులో రెండు కార్లు ఢీకొనగా, ఓ కారు డీవైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఖమ్మంకు చెందిన సుధాకర్ మంగళవా రం తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా వెనక నుండి మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుధాకర్ కారు బోల్తా పడగా అందులో ఉన్న వారు స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయాన వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా ఖమ్మం అర్బన్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు.
30 ట్రక్కుల ఇసుక డంప్ సీజ్
తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం శివార్లలో నిల్వ చేసిన 30 ట్రక్కుల ఇసుకను మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ధరావత్‌తండాకు చెందిన ధరావత్ రమేష్, ధరావత్ రవీందర్ అనుమతి లేకుండా ఇసుక నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య