
సత్తుపల్లికి గరిష్ట ఫలాలు
● ‘సీతారామ’తో నియోజకవర్గంలో 81వేల ఎకరాలకు సాగునీరు ● ఆయకట్టును స్థిరీకరించిన జలవనరుల శాఖ ● కల్లూరు మండలానికి చేరిన గోదావరి జలాలు
కల్లూరురూరల్: సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలోని సాగు భూములకు పుష్కలంగా సాగునీరు అందనుంది. నియోజకవర్గంలోని కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో 81,819 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు. ఈమేరకు జల వనరుల శాఖ అధికారులు ఆయకట్టును స్థిరీకరించారు. తద్వారా కృష్ణా నది పరీవాహకంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాకున్నా సీతారామ జలాలతో పంటల సాగుకు డోకా ఉండదని చెబుతున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గ భూములకు సాగునీరు అందనుందని అంచనా వేస్తున్నారు.
ఎక్కడెక్కడ.. ఎంతెంత?
అశ్వాపురం మండలం బీజీ.కొత్తూరులోని పంప్ హౌస్ నుంచి ఇటీవల గోదావరి జలాలను విడుదల చేశారు. నీరు ములకలపల్లి మండలం మీదుగా ఏన్కూరు మండలానికి అక్కడి లింక్ కెనాల్ నుంచి ఎన్నెస్పీ కెనాల్‌లోకి చేరి సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తోంది. ఈమేరకు 21వ బ్రాంచి కెనాల్ 55 కి.మీ. నుంచి 101.306 కి.మీ. వరకు అందే నీరు వేంసూరు, పెనుబల్లి మండలాల్లో 5,733 ఎకరాలకు అందుతుంది. అలాగే, విధంగా కల్లూరు, తల్లాడ మండలాల్లో సాగర్ ఆయకట్టులోని 19,159 ఎకరాలకు, మధిర బ్రాంచ్ కెనాల్ 0 కి.మీ. నుంచి 22.750 కి.మీ. వరకు కాల్వ ద్వారా 31,069 ఎకరాలకు, కల్లూరు, తల్లాడ మండలాల్లో చెరువులు, కంటల కింద 8,450 ఎకరాలకు సీతారామ సాగర్ ద్వారా గోదావరి జలాలు అందనున్నాయి.
ఎత్తిపోతల పథకాలకు అనుసంధానం
ప్రస్తుతం సాగర్ జలాలపై ఆధారపడి పలు ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ పథకాలను సీతారామ సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేయనున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ అధికారులు నిర్ణయం తీసుకోగా, కల్లూరు మండలంలోని కప్పలబంధం, బత్తులపల్లి ఎత్తిపోతల పథకం, ఖాన్‌ఖాన్‌పేట, నారాయణపురం ఎత్తిపోతల కింద సాగయ్యే 2,420 ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయి. అలాగే, వేంసూరు మండలంలోని వేంసూరు–1, 2 లిఫ్ట్‌ల కింద 2,300 ఎకరాలు, పెనుబల్లి మండలంలోని రాథోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, టేకులపల్లి, తాళ్లపెంట, బయ్యన్నగూడెం ఎత్తిపోతల పథకాల కింద 5,438 ఎకరాలకు నీరు అందించనున్నారు. ఆపై లంకాసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 7,250 ఎకరాలకు సైతం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందుతాయి. సీతారామ ప్రాజెక్టుతో సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.