
ముందస్తు ‘కోటా’
● ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా ● పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధం ● ఇప్పటికే డీలర్లతో సమావేశం
ఖమ్మం సహకారనగర్: పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుండగా.. జూన్‌లో మాత్రం ఒకేసారి మూడు నెలల కోటా అందించనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం ముందుగానే లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు ప్రతి నెల మాదిరిగానే బియ్యం సరఫరా చేసి.. ప్రజలకు పంపిణీ ప్రారంభించే సమయానికి మిగతా రెండు నెలల బియ్యం నిల్వలు కూడా ఆయా రేషన్ దుకాణాలకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నెలకు 6,500 మెట్రిక్ టన్నులు..
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ దుకాణాలుండగా.. వీటి పరిధిలో 4,10,988 కార్డులు ఉన్నాయి. 11,48,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా 73,75,868 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. సరాసరిన 90 శాతం వరకు లబ్ధిదారులు తీసుకెళ్తున్న క్రమంలో సుమారు 6,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అవసరం అవుతుండగా.. మూడు నెలలకు సంబంధించి సుమారు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.
పంపిణీపై సమాలోచనలు..
ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయాల్సిన క్రమంలో అధికారులు, డీలర్లు సమాలోచనలు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో నెలకు సరిపోయే అన్ని సరుకులు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉన్న క్రమంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఎలా పంపిణీ చేయాలి.. ఎక్కడ నిల్వ ఉంచాలి.. పంపిణీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అంశాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలోనూ మూడు నెలల బియ్యం పంపిణీపై అధికారులు పలు సూచనలు చేశారు.
సన్నద్ధమవుతున్నాం
ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం రేషన్ లబ్ధిదారులకు ఇవ్వాలనే అంశంపై పలు సూచనలు చేశారు. వారి సూచనల ప్రకారం జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వాటిని అమలు చేయనున్నాం. – చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

ముందస్తు ‘కోటా’