
ఉన్న వారిపైనే భారం !
● కేఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో వేధిస్తోన్న సిబ్బంది కొరత ● కార్పొరేషన్‌కు కొత్తగా మంజూరు కాని పోస్టులు ● మున్సిపాలిటీ నాటి పోస్టులతో ఇక్కట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రధాన విభాగమే కాదు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. నగర విస్తరణ, అభివృద్ధి పనుల ప్రణాళికలు, పరిశీలన ఈ విభాగం ద్వారానే జరుగుతాయి. నిర్మాణాలకు అనుమతుల జారీ, నిర్మాణాల పర్యవేక్షణ, కార్పొరేషన్‌లో రోడ్లు, డ్రెయినేజీలపై ఆక్రమణలను గుర్తింపు, తొలగింపు బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఈ విభాగంలో ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా.. ఉన్న వారిపై పనిభారం పడుతోంది.
పోస్టులు ఏవీ?
ఖమ్మం పురపాలక సంఘంగా ఉన్న నాటి పోస్టులతోనే ప్రస్తుతం పరిపాలన నెట్టుకొస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి తొమ్మిది పోస్టులను మంజూరు చేశారు. ఇందులో ఏసీపీ, టీపీఓ ఒక్కొక్కరితో పాటు టీపీఎస్ మూడు, టీపీబీఓ పోస్టులు నాలుగు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీపీ, టీపీఓ ఒక్కొక్కరు, టీపీఎస్‌లు ఇద్దరు, టీపీబీఓలు నలుగురు విధుల్లో ఉన్నారు. టీపీబీలు ఇటీవలే బాధ్యతలు చేపట్టగా శిక్షణ పొందుతున్నారు. ఖమ్మం నగరం విస్తరణ దృష్ట్యా టౌన్‌ప్లానింగ్ విభాగానికి పోస్టుల సంఖ్య పెంచాల్సి ఉంది. అసలే ఉద్యోగులు తక్కువగా ఉండడంతో కార్యకలాపాలపై ప్రభావం పడుతుండగా.. ఇటీవల ఈ విభాగం ఉద్యోగులకు ఇతర మున్సిపాలిటీల్లో అదనపు విధులు కేటాయిస్తున్నారు. దీంతో రెండు చోట్ల సరైన న్యాయం చేయలేకపోతున్నారు.
పనులన్నీ అక్కడే..
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లింపునకు రాయితీ ప్రకటించడంతో కేఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించారు. 40 వేల దరఖాస్తులు రాగా.. అత్యధిక ఫీజులు వసూలు చేసిన కార్పొరేషన్‌గా ఖమ్మం నిలిచింది. ఈ పనులతో పాటు నగరంలో ఆక్రమణల తొలగింపుకు కృషి చేస్తున్నారు. మరోపక్క రోడ్ల విస్తరణ ప్రణాళికల రూపకల్పన, మార్కింగ్ పెట్టడం, విస్తరణ పనులను పర్యవేక్షించడం బాధ్యతలు నిర్వర్తించాలి. అదనంగా రోజువారీగా నిర్మాణాలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడం, క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాల్సి ఉండడంతో పనుల్లో ఆలస్యమవుతోందనే చర్చ కేఎంసీలో జరుగుతోంది. కాగా, ఉద్యోగులు పనిభారం కారణంగా కొన్ని చోట్ల పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు ఇదే అదునుగా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని చెబుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
పురపాలక సంఘం నుండి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన ఖమ్మం కార్పొరేషన్‌కు ఆ స్థాయిలో ఉద్యోగులను కేటాయించలేదు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మంను 2012 అక్టోబర్‌లో ప్రభుత్వం నగర పాలక సంస్థగా ప్రకటించింది. విలీన గ్రామాలను కలుపుకుని 60డివిజన్లతో ఖమ్మం కార్పొరేషన్ రోజురోజుకు విస్తరిస్తోంది. కానీ మున్సిపాలిటిగా ఉన్నప్పుడు టౌన్‌ప్లానింగ్ విభాగానికి కేటాయించిన పోస్టులతోనే నేటికీ ఇప్పటికీ నెట్టుకొస్తుండడంతో ప్రజా సేవలతో పాటు అభివృద్ధి పనుల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది.