
12ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు..
మహిళను స్వగ్రామానికి చేర్చిన ‘అన్నం’
ఖమ్మంఅర్బన్: గత 12ఏళ్ల క్రితం కుటుంబానికి దూరమైన వృద్ధురాలిని చేరదీసి చికిత్స చేయించిన ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆమె కోలుకున్నాక కుటుంబం చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో ఖమ్మం పాత బస్టాండ్ పరిసరాల్లో 50 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధురాలు భిక్షాటన చేస్తుందనే సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆమెకు ఆశ్రయం కల్పిస్తూనే చికిత్స చేయించారు. దీంతో ఇటీవల కోలుకున్న ఆమె తన పేరు గౌరమ్మ అని, స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామమని, భర్త పేరు నరసింహగా వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులకు, వారి ద్వారా కుటుంబానికి తెలపగా గౌరమ్మ ఫొటోను చూసిన ఆమె తమ్ముడు ప్రసాద్ 12 ఏళ్ల క్రితం తమ సోదరి కనిపించకుండా పోయిందని, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో ఆమెను అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావును ఖమ్మం నుండి వాహనంలో పెద్దహోత్తురు తీసుకెళ్లి అలూరు సీఐ రాజు వెంకటేష్ సమక్షాన కుటుంబానికి అప్పగించారు. ఈమేరకు గౌరమ్మను అక్కున చేర్చుకున్న వారు శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.