
డిజిటల్
పల్లె ముంగిట
గ్రామాల్లో డిజిటల్ విప్లవం..
గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీఐసీఎస్‌సీ ద్వారా గ్రామాల్లో సీఎస్‌సీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.35 వేలు మంజూరు చేస్తుంది. సెర్ప్, సీఎస్‌సీ–ఎస్‌పీవీ సంస్థలు జిల్లాను మండలాల వారీ క్లస్టర్లుగా విభజించి, ప్రతీ గ్రామానికి కనీసం ఒక మోడల్ సీఎస్‌సీ ఉండేలా ప్రణాళిక రూపొందించాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సర్టిఫికెట్లు, బ్యాంకింగ్ సేవలు, ఆధార్ అప్‌డేట్, బిల్లుల చెల్లింపు, మీ సేవ ద్వారా అందే సేవలు, నగదు రహిత లావాదేవీలు చేరువవుతాయి. అయితే, ఈ కేంద్రంలో చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా చూస్తారు.
దశల వారీగా శిక్షణ
సెర్ప్, సీఎస్‌సీ–ఎస్‌పీవీ సంయుక్తంగా 153 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, తొలి దశలో 70 మందికి ఆర్‌ఎస్‌ఈటీఐ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) ద్వారా ఏడు రోజుల శిక్షణ పూర్తి చేశారు. ఆపై ప్రోత్సాహకంగా మొదటి ఆరు నెలలు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తారు. తద్వారా వారిలో నమ్మకం పెంచడంతో పాటు స్థిరమైన ఉపాధి దిశగా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండో దశలో మిగిలిన మహిళలకు టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ఆధ్వర్యాన ఖమ్మంలోని ఐటీ హబ్‌లో ప్రత్యేకంగా ఈడీపీ/డిజిటల్ స్కిల్ శిక్షణ ఇచ్చారు. వీరికి ఉచితంగా బయోమెట్రిక్ పరికరాలు అందించగా, అక్టోబర్ 1 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో సీఎస్‌సీల ద్వారా డిజిటల్ లావాదేవీలు, ఇతర సేవలు మొదలుకానున్నాయి.
ఆధార్ సేవలకు అనుమతి వస్తే..
మోడల్ సీఎస్‌సీల ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలే కాక ఆధార్ సేవలు కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసి, ఆధార్ అప్‌డేట్ సేవలకు అవసరమైన యూసీఎల్(అప్‌డేట్ క్లెయింట్ లైట్) అనుమతులకు అధికారులు యత్నిస్తున్నారు. ఇవి కూడా మంజూరైతే సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ఆధార్ కార్డుల్లో మొబైల్ నంబర్ మార్పు, చిరునామా సవరణ సేవలు అందించగలుగుతారు.
ఎస్‌హెచ్‌జీల ద్వారా
నగదు రహిత లావాదేవీలు
దేశవ్యాప్తంగా పది జిల్లాలు..
రాష్ట్రంలో ఖమ్మానికి స్థానం
జిల్లాలో 153 మంది మహిళా
సంఘాల సభ్యులకు శిక్షణ
ఆపై గ్రామాల్లో మోడల్ సీఎస్‌సీల
ఏర్పాటుకు ప్రణాళిక
దేశానికి ఆదర్శరంగా నిలిచేలా..
దేశవ్యాప్తంగా డీఐసీఎస్‌సీ ప్రాజెక్టులో పైలట్‌గా ఎంపిక చేసిన జిల్లాల్లో ఖమ్మం ఉంది. ఎస్‌హెచ్‌జీలతో సీఎస్‌సీలు నిర్వహించేలా శిక్షణ అందించాం. ఇందుకు సెర్ప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా సభ్యులకు ఉపాధి, గ్రామీణులకు డిజిటల్ సేవలు వేగంగా అందిస్తూ జిల్లాను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం.
– డాక్టర్ విగ్నేష్ సోర్ణమోహన్,
స్టేట్ హెడ్, సీఎస్‌సీ
సేవలు చేరువ అవుతాయి..
బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపుల వంటి సేవలు గ్రామీణులకు చేరువవుతాయి. దీంతో పట్టణాలకు వెళ్లే ఇబ్బంది ఉండదు. శిక్షణలో భాగంగా కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఇది మా జీవితాలను మార్చుకునేలా ఉపయోగపడుతుంది. సెర్ప్ నుంచి రుణం మంజూరు కాగానే సేవలను మరింతగా విస్తరిస్తాం.
– గుగులోతు స్వప్న, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు,
చింతగుర్తి, రఘనాథపాలెం మండలం

డిజిటల్

డిజిటల్