
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
రఘునాథపాలెం : యూరియా, డీఏపీ సహా ఇతర ఎరువులన్నీ రైతులకు ఎమ్మార్పీకే విక్రయించాలని, బ్లాక్ పేరుతో అధిక ధరలకు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ హెచ్చరించారు. రఘునాథపాలెం మండలం వీవీపాలెం సహకార సొసైటీలో ఎరువుల విక్రయాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ డీలర్ దుకాణాల్లో స్టాక్ బోర్డులు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు సకాలంలో, సరిపడా ఎరువులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య, ఖమ్మం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి, వ్యవసాయ టెక్నికల్ అధికారి పవన్ కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, సొసైటీ అధ్యక్షడు రావూరి సైదబాబు, ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, సీఈఓ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ మార్కెట్ నిర్మాణాలు
ఆదర్శంగా ఉండాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నిర్మిస్తున్న మిర్చి మోడల్ మార్కెట్ పనులు ఆదర్శంగా ఉండాలని సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం ఆచప మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఖమ్మంలో మిర్చి మోడల్ మార్కెట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, మార్కెట్ యార్డులతో పాటు కోల్డ్ స్టోరేజీ, రైతుల విశ్రాంతి భవనం, మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాల పనుల్లో నాణ్యత పాటించాలని అన్నారు. మిర్చి సీజన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, డీఎంఓ ఎంఏ అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్ర మోహన్