‘యూరియా’పై నిఘా | - | Sakshi
Sakshi News home page

‘యూరియా’పై నిఘా

Jul 28 2025 8:11 AM | Updated on Jul 28 2025 8:11 AM

‘యూరియా’పై నిఘా

‘యూరియా’పై నిఘా

● సరఫరాను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖలు ● సహకార అధికారులకు మానిటరింగ్‌ బాధ్యత ● ఉమ్మడి జిల్లాకు 2,646 మెట్రిక్‌ టన్నులు

ఖమ్మంవ్యవసాయం : యూరియా సరఫరాపై ప్రభుత్వం నిఘా పెంచింది. పలు ప్రాంతాల్లో రైతులకు యూరియా లభించక ఇబ్బంది పడుతున్నారు. సహకార సంఘాల్లో నిల్వ లేకపోవడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ.. పంటలకు ఎరువుల వినియోగం పెరిగింది. ప్రధానంగా యూరియా కోసం రైతులు ఆరాట పడుతున్నారు. పలుచోట్ల సరిపడా లభ్యం కాక ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో యూరియా పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. పక్కదారి పట్టకుండా నిఘా పెంచింది. ఇప్పటికే వ్యవసాయ అధికారులు, పోలీసులు ఎరువుల పంపిణీని పర్యవేక్షిస్తుండగా, తాజాగా సహకార శాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అంతేకాక మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ, సహకార జిల్లా స్థాయి అధికారుల బృందం కూడా ఎరువుల నిల్వలను, పంపిణీని తనిఖీ చేస్తోంది.

ఉన్నతాధికారులకు నివేదికలు..

యూరియా కొరత, సరఫరాలో చోటు చేసుకుంటున్న ఇబ్బందులను అధిగమించటం, రైతులకు సక్రమంగా ఎరువును అందించటం లక్ష్యంగా సహకార శాఖలో పనిచేస్తున్న జూనియర్‌ ఇన్స్‌పెక్టర్లు, సీనియర్‌ ఇన్స్‌పెక్టర్లు, అసిస్టెంట్‌ రిజిస్టార్లకు సహకార సంఘాల్లో ఎరువుల పంపిణీపై మానిటరింగ్‌ బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం జిల్లాలో 25 మంది సహకార అధికారులు కేటాయించిన సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు, పంపిణీకి తీసుకుంటున్న చర్యలు, అవసరాలు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. అంతేగాక సరఫరా అవుతున్న యూరియా సక్రమంగా రైతులు వినియోగిస్తున్నారా..?, పక్కదారి పడుతుందా..? వంటి అంశాలను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్‌ పోస్టులపై కూడా దృష్టిసారించారు. వీరితో పాటు వ్యవసాయ, పోలీసు యంత్రాంగం యూరియా విక్రయాలను తనిఖీలు చేస్తుంది.

ఉన్నతాధికారుల తనిఖీలు..

యూరియా సరఫరాను ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో ఉన్న నిల్వలు, రేక్‌ పాయింట్‌కు వచ్చిన యూరియా, అక్కడ నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సరఫరా, సహకార సంఘాల్లో విక్రయాలు, నిల్వలను మార్క్‌ఫెడ్‌ జీఎం విష్ణువర్దన్‌, ఉమ్మడి జిల్లా మేనేజర్‌ సునీత, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, డీసీఓ జి. గంగాధర్‌ రెండు రోజులుగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, ఖమ్మం రూరల్‌ తదితర మండలాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని చండ్రుగొండ, కొత్తగూడెం తదితర మండలాల్లో నిల్వలను పరిశీలించారు.

ప్రాధాన్యతా క్రమంలో సరఫరా..

జలాశయాల్లో నీరు, ప్రధానంగా సాగు చేసే పంటలు, వాటికి ప్రస్తుతం అవసరమైన యూరియా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో లక్ష్యం మేరకు వరి సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో సాగు పనులు సాగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల కింద వరి, ఇతర పంటలు సాగు చేస్తుండగా ఆయా ప్రాంతాలకు యూరియా సరఫరాపై చర్యలు చేపట్టారు.

రేక్‌ పాయింట్‌కు చేరిన యూరియా..

చింతకాని: ఉమ్మడి జిల్లాకు ఆదివారం 2,646 మెట్రిక్‌ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎన్‌ఎఫ్‌ఎల్‌(నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీ లిమిటెడ్‌)కు చెందిన యూరియా మండలంలోని పందిళ్లపల్లి రైల్వే రేక్‌ పాయింట్‌కు చేరింది. దీన్ని పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేసి, అక్కడ నుంచి రైతులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం వచ్చిన 2,646 మెట్రిక్‌ టన్నుల్లో ఖమ్మం జిల్లాకు 1,446, భద్రాద్రి జిల్లాకు 1,200 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. జిల్లాకు కేటాయించిన 1,446 టన్నుల్లో మార్క్‌ఫెడ్‌కు 867.6 టన్నులు, ప్రైవేటు డీలర్లకు 578.4 టన్నులు సరఫరా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement