
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● అధికారులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల జోలికి వెళ్లొద్దు ● ఆగస్టు రెండో వారంలో చేప పిల్లల పంపిణీ ● యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం ● రెండు జిల్లాల అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీహరి, తుమ్మల, పొంగులేటి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరి చేర్చాలని సూచించారు. వరద ముంపు, సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఆదివారం కొత్తగూడెంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల వద్దకు వెళ్లొద్దని అటవీ, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడేళ్లపాటు రూ.12,600 కోట్లతో ఇందిరా గిరి జలవికాసం ద్వారా సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, ఎమ్మెల్యేలు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ప్రతిపాదనలు ఇవ్వడంలో ఆలస్యమవుతోందని అన్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గోదావరి వరదలు ఇప్పటివరకు సాధారణ స్థితిలో ఉన్నాయని అన్నారు. వన మహోత్సవంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని, గత పదేళ ్లలో నాటిన, బతికిన మొక్కల వివరాలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని అన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేరేలా అధికారులు, ప్రజాప్రతిధులు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యాభివృద్ధికి మలుపు తిప్పే కార్యక్రమమని అన్నారు. ఆగస్టు రెండో వారంలో చేప పిల్లల కార్యకమాన్ని చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువు గట్లపై చేప పిల్లల పెంపకం, ఖర్చు తదితర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటేలా చూడాలన్నారు.
అభివృద్ధిలో మోడల్‌గా మార్చాలి
రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో మోడల్‌గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాపై కట్టుబడి ఉందన్నారు. వరదలు, వర్షాలకు సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
సంక్షేమ లక్ష్యాన్ని సాధించాలి
అధికారులు ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాన్ని సాధించేలా పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వన మహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. రెవెన్యూ శాఖలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెలలో శ్రావణమాసం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా చేయాలని, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల వెంట ఏర్పడిన గుంతలను పూడ్చాలని చెప్పారు. వర్షాకాలం నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, వసతి గృహాల పర్యవేక్షణ కోసం నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం కలెక్టర్ అనుదీప్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.