
నాటక రంగానికి నాడు ఘన కీర్తి
● అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డి
ఖమ్మంగాంధీచౌక్: నాటక రంగానికి గతంలో ఘన కీర్తి ఉండేదని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామాల్లో సురభి నాటికలు ప్రదర్శించేవారని, వాటిని ప్రజలు ఎంతగానో ఆదరించేవారని చెప్పారు. నాటకాల నుంచే సినిమా రంగం అభివృద్ధి చెందిందని, నెల నెలా వెన్నెల నిర్వాహకులు నాటక రంగానికి జీవం పోస్తున్నారని అభినందించారు. ఇటీవల మలేషియా సినీ అవార్డులు సాధించిన దర్శకులు కొత్తపల్లి శేషు, కమెడియన్ మొగిలి గుణకర్, యామిని, వైదేహి, రవి, అన్నపూర్ణ, గుజ్జరి శ్రీధర్‌బాబును శ్రీనివాసరెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల అనూరాధ, నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉషోదయ కళానికేతన్ వారు ప్రదర్శించిన ‘కిడ్నాప్’ నాటిక ప్రేక్షకులను అలరించింది.
జిల్లాకు రేపు బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడి రాక
ఖమ్మం మామిళ్లగూడెం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 29న ఉదయం 8 గంటలకు నాయకన్ గూడెంలో పార్టీ కార్యకర్తలు రామచంద్రరావుకు స్వాగతం పలుకుతారని, 9 గంటలకు కూసుమంచి శివాలయాన్ని దర్శించుకుంటున్నారని తెలిపారు. 10 గంటలకు ఖమ్మం కాల్వొడ్డు నుంచి బైక్ ర్యాలీగా సప్తపది ఫంక్షన్ హాల్‌కు చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారని వెల్లడించారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గెంటేల విద్యాసాగర్, ఈవీ.రమేష్, నంబూరి రామలింగేశ్వరావు, జయరాజు, దిద్దుకూరి వెంకటేశ్వర్లు, ఆర్‌వీఎస్ యాదవ్, విజయారెడ్డి, వెంకటనారాయణ, పమ్మి అనిత పాల్గొన్నారు.
బోనకల్ యువతికి డాక్టరేట్
బోనకల్: బోనకల్‌కు చెందిన బాలు నిర్మలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ‘బోయ జంగయ్య కథలో మానవతా దృక్ప ధం’ అనే అంశంపై డాక్టరేట్ లభించింది. ఆచా ర్య మాదిరెడ్డి ఆండాళమ్మ పర్యవేక్షణలో పరిశోధనలు చేసినందుకు గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపిక కాగా, పలువురు అభినందించారు.
ఆరుగురు ఎంపీడీఓల నియామకం
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని ఆరు మండలాలకు ఎంపీడీఓలను నియమిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తుర్వులు జారీ చేశారు. రఘునాథపాలెం ఎంపీడీఓగా కొండపల్లి శ్రీదేవి, కూసుమంచికి ఏమేడూరి రామచంద్రరావు, కొణిజర్లకు రామిరెడ్డి ఉపేంద్రయ్య, తల్లాడకు ఏనుగు సురేష్‌బాబు, ఏన్కూర్‌కు బి.రంజిత్‌కుమార్, సింగరేణి ఎంపీడీఓగా పెగళ్లపాటి సూర్యనారాయణను నియమించారు. వీరంతా వెంటనే విధుల్లో చేరనున్నారు.
‘నవోదయ’లో ప్రవేశానికి ఆహ్వానం
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరిలో అర్హులను 2026 జనవరి 7న జరిగే ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

నాటక రంగానికి నాడు ఘన కీర్తి

నాటక రంగానికి నాడు ఘన కీర్తి