శివమొగ్గ: శివమొగ్గ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి సోమణ్ణను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల జెండాలతో అడ్డుకోవడానికి యత్నించారు. బస్టాండ్ సమీపంలోని అశోక్ సర్కిల్‌లో నిరసనకారులు మంత్రి కారును ముట్టడించి, సర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి వాహనశ్రేణి నిలిచిపోవడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. యూత్ కాంగ్రెస్ నేతలు హర్షిత్, చరణ్, ప్రవీణ్ సహా పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు కదలకపోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ తతంగంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు మంత్రి వాహనాలు వెళ్లిపోయాయి.
అత్యాచార మాంత్రికుడు అరెస్టు
యశవంతపుర: పట్టిన దయ్యం విడిపిస్తానంటూ మహిళపై అత్యాచారం చేసిన ఘటన చిక్కమగళూరు కొప్ప, ఎన్‌ఆర్‌పుర ఠాణాల పరిధిలో జరిగింది. నెల రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సతీశ్‌ను కొప్ప పోలీసులు బెంగళూరు జేపీ నగరలో అరెస్ట్ చేశారు. నిందితుడు సతీశ్ పత్రి మంత్రాలు వేస్తానని చెప్పుకునేవాడు. ఓ మహిళ దయ్యం పట్టిందని అతనిని సంప్రదించగా పూజల పేర్లతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె పోలీసుకు ఫిర్యాదు చేయగా నిందితుడు పరారయ్యాడు. ఎట్టకేలకు అరెస్టు చేసి కొప్పకు తరలించారు.
ఎయిర్‌పోర్టులో కామాంధ హెచ్‌ఆర్..
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న యువతిని వేధిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విమానాశ్రయంలో ఆహార, పానీయాల సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని (20) అదే కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ సతాయించసాగాడు. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చూపాలని, ఎవరితో మొబైల్‌లో మాట్లాడుతున్నావు? అని అవమానించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత నెల 30న గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
3 టిఫిన్ల బిల్లు రూ.795
● యూట్యూబర్ లబోదిబో
యశవంతపుర: బెంగళూరులో కొన్ని హోటళ్లలో కాఫీ, టిఫిన్ల రేట్లు భగ్గుమంటాయి. సామాన్య, మధ్యతరగతి జనం ఆ ధరలను భరించలేరు. ఓ యూట్యూబర్ ఇది తెలియక అలాంటి హోటల్‌కు వెళ్లి నోరెళ్లబెట్టాడు. 3 టిఫిన్లకు రూ.795 బిల్ వేశారని, ఇది న్యాయమా? అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కేసరిబాత్, వెన్న మసాల దోసె, మామూలు దోసెకు ఇంత మొత్తం వసూలు చేశారని తెలిపాడు. బెంగళూరు కెంపేగౌడ విమానశ్రయంలోని హోటల్‌లు తిన్నట్లు తెలిపాడు. బయట హోటల్స్ కంటే విమానాశ్రయంలోని క్యాంటీన్లలో ధరలు ఎక్కువ అని నెటిజన్లు అతన్ని బుజ్జగించారు. రూ.300లతో పోయేదానికి ఎక్కువే ఖర్చు పెట్టావని మరికొందరు నిట్టూర్చారు.
కొమ్మ కూలి..
రిటైర్డు టీచరు బలి
తుమకూరు: జిల్లాలోని తిపటూరు పట్టణంలో బి.హెచ్. రోడ్డులో కల్పతరు కళాశాలకు ఎదురుగా ఒక భారీ చెట్టు కొమ్మ ఆకస్మాత్తుగా కూలింది. ఈవీ స్కూటర్‌లో వెళ్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు శివస్వామిపై పడడంతో తీవ్ర గాయాలతో క్షణాల్లో చనిపోయాడు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు, బెస్కామ్ సిబ్బంది పరిశీలించారు. కొమ్మలను, మృతదేహాన్ని తరలించారు. అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న మరో కొమ్మను కత్తిరించారు. ముందే ఈ పని చేసి ఉంటే ఓ ప్రాణం పోయేది కాదని స్థానికులు మండిపడ్డారు. సంబంధిత అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రజా పోరాటం: సీఎం
బనశంకరి: దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సీఎం డీకే.శివకుమార్ అన్నారు. సీఈసీ, సర్‌కు వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండి కూటమి ఆందోళనల్లో డీకే పాల్గొని మాట్లాడారు. ఈ పోరాటం ఏ వ్యక్తికి పరిమితం కాదన్నారు. ఇది దేశ పోరాటం. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కోసం ప్రజలు పోరాడుతున్నారు. ఎంతోమంది త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని గమనించి, ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలన్నారు. ఇండి కూటమి ధర్నా దేశ ప్రజాస్వామ్య ఆశయాలను కాపాడుతుందన్నారు.


