బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్‌లోని జిగని పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.18 లక్షల విలువైన 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజశేఖర్ (28), చరణ్ కుమార్ (19) పవన్ కుమార్ (21). నకిలీ తాళాలను ఉపయోగించి బైక్‌లను ఎత్తుకెళ్లేవారు. తాళం పనిచేయకపోతే హ్యాండిల్ లాక్‌ను విరగ్గొడతారు. ఆ బైక్‌లను తక్కువ ధరకు అమ్మి, జల్సాలు చేసేవారు. కొంతకాలంగా బైక్ చోరీలు పెరగడంతో ఇన్‌స్పెక్టర్ నవీన్, పోలీసులు గాలింపు జరిపి ముఠాను పట్టుకున్నారు.
రైతును చంపిన చిరుత
దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లా మాగడి తాలూకా కల్లదేవనహళ్లిలో ఘోరం జరిగింది. సోమవారం ఉదయం తోటలో పూలు విడిపించడానికి వెళ్లిన రైతుని చిరుత బలి తీసుకుంది. గ్రామానికి చెందిన రైతు శివస్వామి (62), ఆలయంలో పూజారిగా పనిచేస్తూ ఉంటాడు. తమ తోటలో కాకడ పూలు కోయడానికి వెళ్లగా, అక్కడే పొంచి ఉన్న చిరుత మీదపడి చంపేసింది. రామనగర జిల్లాలో ఇటీవల చిరుతల బెడద తీవ్రమైంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఏఐ వీడియో పంపి బ్లాక్‌మెయిల్
● రూ.1.85 లక్షల వసూలు
బనశంకరి: డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకునికి రూ.1.85 లక్షలు దోచేశారు. బెంగళూరు బెల్లందూరు పరిధిలో జరిగింది. గత నెల 27వ తేదీన డేటింగ్ యాప్ ద్వారా ఆరాధ్య అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లు చేసుకుంటూ ఉండేవారు. తరువాత ఓ రోజు వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆపై ఏఐ ద్వారా తయారుచేసి అతని అశ్లీల వీడియోను మొబైల్‌కు పంపించడంతో భయపడ్డాడు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి రూ.1.85 లక్షల వరకూ కొట్టేశారు. సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
వీడియో కాల్స్‌తో జాగ్రత్త
రాష్ట్రంలో ఇలాంటి సైబర్‌నేరాలు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయని పోలీస్‌శాఖ తెలిపింది. 2024లో ఇలాంటివి 20 కేసులు, 2025లో 104, 2026 ఆగష్టు చివరినాటికి 57 కేసులు నమోదైనట్లు పేర్కొంది. డేటింగ్ యాప్‌ల ద్వారా అమాయకులను గుర్తించి వలవేసి డబ్బులు దండుకుంటున్నారు. గుర్తుతెలియని వాట్సాప్, ఇతరత్రా వీడియో కాల్స్‌ను స్వీకరించరాదని పోలీసులు సూచించారు. ఏఐ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించి బ్లాక్‌మెయిల్ చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


