మండ్య: విజయనగర సామ్రాజ్యం కాలం నుంచి కొనసాగుతున్న దసరా మహోత్సవ సంప్రదాయం మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నంలో కొనసాగుతుండటం గర్వకారణం అని సినీ నటి అదితి ప్రభుదేవా అన్నారు. శ్రీరంగపట్నం దసరా మహోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీరంగ పట్టణం తాలూకా స్టేడియంలో యువ సంభ్రమలో ఆమె పాల్గొని మాట్లాడారు. యువ ప్రతిభావంతులు కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు చాలా అవసరమని ఆమె అన్నారు. యువతలో సజనాత్మకతను, సాంస్కృతిక ఆసక్తిని ప్రోత్సహించడం ద్వారా మన దేశ కళా వారసత్వాన్ని తర్వాతి తరానికి పరిచయం చేయడానికి యువ సంభ్రమ సహాయపడుతుందన్నారు. ఎమ్మెల్యే ఎ.బి.రమేష్ బండిసిద్దే గౌడ మాట్లాడుతూ మైసూరు దసరాలో మాదిరిగా శ్రీరంగపట్నంలో యువజనోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా యువతకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలు లభించాలని అన్నారు. శ్రీరంగపట్న దసరా మహోత్సవంలో తొలిసారిగా యువ సంభ్రమ వేడుకలను జరపడం ముదావహమని కలెక్టర్ డాక్టర్ కుమార్ అన్నారు. ఇందులో విద్యార్థుల కళా ప్రదర్శనకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు డోళ్లు వాయించి ఉత్సాహపరిచారు. ఎస్పీ వి.జె. శోభరాణి, మండ్య వర్సిటీ వీసీ శివానంద మూర్తి తదితరులు పాల్గొన్నారు.


