న్యూస్‌రీల్
కాపాడండి
బెళగావిలో పేలిన మరో ఫ్రిజ్
యశవంతపుర: ఇంటిలో ఫ్రిడ్జ్ పేలిన ఘటన బెళగావి నగరంలో జరిగింది. సహ్యాద్రి నగరలో శ్రీదేవి జోషి ఇంటిపైన అంతస్తులో రూపా నసిపుడి అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. శనివారం ఉదయం గుడికి వెళ్లిన సమయంలో ఫ్రిడ్జ్ భారీ శబ్ధంతో పేలిపోయి మంటలు రేగాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న పిల్లలు కేకలు వేయటంతో చుట్టు పక్కలవారు వెళ్లి రక్షించారు. పేలుడుతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎపిఎంసి ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. వినాయక చవితి రోజున బెళగావిలోనే ఓ రేకుల ఇంట్లో ఫ్రిజ్ పేలిపోయి కుటుంబం మొత్తం చనిపోవడం తెలిసిందే.
హిండలగాకు ప్రజ్వల్
తరలింపు వాయిదా
శివాజీనగరర: అత్యాచార కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఉన్న జీవితఖైదీ, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెళగావిలోని హిండలగా సెంట్రల్ జైలుకు మార్చే ప్రక్రియను నిలిచిపోయింది. రాష్ట్రంలోని ఇతర జైళ్లకు ఏడుగురు ఖైదీల బదిలీకి జైళ్ల శాఖ సిద్ధమైంది. ఇంతలో జైళ్ల శాఖ డీఐజీ సోమశేఖర్‌ను జీవితఖైదీ శంకర్‌ను అక్రమంగా విడుదల చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామంతో ప్రజ్వల్ బదిలీని పెండింగ్‌లో ఉంచారు. జైలులో ప్రజ్వల్ మొబైల్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని కేసు నమోదు కావడం తెలిసిందే. అక్రమంగా విడుదలైన జీవితఖైదీ శంకర్, అతనికి సహకరించి జైలుపాలైన ఆ శాఖ క్లర్కు శ్రీకాంత్‌తో సహా ఏడుగురు ఖైదీలను రాష్ట్రంలోని వివిధ కారాగాలకు మార్చాలని జైళ్ల చీఫ్ అలోక్‌కుమార్ నిర్ణయించారు.
5.64 లక్షల కేజీల రేషన్ బియ్యం సీజ్
శివాజీనగర: రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై ఆహార, పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 5,64,992 కిలోల అక్రమ రేషన్ బియ్యంతో పాటు దాని రవాణాకు ఉపయోగించిన 24 లారీలను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ రూ.1.34 కోట్లు కాగా, వాహనాల విలువ రూ.3.41 కోట్లుగా ప్రకటించారు. బెళగావి జిల్లా, బెంగళూరు గ్రామీణలోని అత్తిబెలె, కాగవాడ్‌లోని లోకూర్ ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. కొన్ని రైసు మిల్లుల్లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేశారు.
మండ్య అదనపు ఎస్పీ కన్నుమూత
మండ్య: మండ్య జిల్లా అదనపు ఎస్పీ సీఈ తిమ్మయ్య (57) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా మరణించారు. తిమ్మయ్య మూడేళ్లుగా మండ్య జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. సమర్థుడైన, కర్తవ్యనిష్ఠ గల అధికారిగా పేరుపొందారు. శ్రీరంగపట్నంలో హనుమ సంకీర్తన యాత్ర, వినాయక చవితి ఉత్సవాలలో గొడవలు సహా అనేక సున్నిత పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. తిమ్మయ్యకు భార్య, కుమార్తె ఉన్నారు. దక్షిణ జోన్ ఐజీ బోరలింగయ్య, కలెక్టరు కుమార్, ఎస్పీ వి.జె. శోభరాణి, బెంగళూరు డీసీపీ ఎన్. యతీష్ తదితరులు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మైసూరులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
సఫారీలలో
మొబైల్ షూటింగ్ వద్దు
మైసూరు: చామరాజనగర జిల్లాలో వన్యప్రాణి సఫారీల విహారంలో పర్యాటకులు మొబైల్‌ఫోన్లు వాడటాన్ని పూర్తిగా నిషేధిస్తూ డీసీఎఫ్ కుమార్ పుష్కర్ ఉత్తర్వులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సఫారీలలో పర్యాటకులు, డ్రైవర్లు గైడ్‌లు మొబైల్ ఫోన్లు వాడకూడదని తెలిపారు. సమాచార మార్పిడి కోసం అన్ని సఫారీ వాహనాల్లో వైర్‌లెస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంతకుముందు, సఫారీ సమయంలో మొబైల్ ఫోన్‌లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి వన్యప్రాణుల దృశ్యాలను చిత్రీకరించడానికి అనుమతించేవారు. కానీ అడవులు, వన్యప్రాణుల భద్రత రీత్యా సుప్రీంకోర్టు ఇలాంటి చిత్రీకరణలను నిషేధించినట్లు తెలిపారు.
క్యాన్సర్ మందుల ధరలు తగ్గవచ్చు
● ఔషధాలు, పరికరాలు
చాలా ఎక్కువ రేట్లున్నాయి
● ఆరోగ్యమంత్రి ఖాదర్
శివాజీనగర: క్యాన్సర్‌తో సహా పలు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగించే 283 మందుల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ తెలిపారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ మందుల ధరలను 70 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఆ మందుల అమ్మకాల్లో వచ్చే లాభాల మార్జిన్ 30 శాతం లోపే ఉండాలని కేంద్రం ఔషధ వ్యాపారులను ఆదేశించినట్లు తెలిపారు. రూ.6500 ధర ఉన్న మందును రూ.65 వేలకు అమ్ముతున్న పరిస్థితి ఉంది, ఇలాంటి అధిక ధరలను తగ్గిస్తే, రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం బాగా తగ్గుతుందని ఆయన తెలిపారు. క్యాన్సర్‌తో పాటు ఇతర అధిక ప్రమాదకర వ్యాధుల మందుల ధరలపై పరిమితి ఉండాలన్నారు. వైద్య పరికరాల మీద కూడా అధిక ధరలు వసూలు చేస్తున్నారని, కంపెనీలు, వ్యాపారులు వారి లాభాలను పరిమితం చేసుకోవాలని కోరారు. 283 మందుల ధరలను తగ్గిస్తే లక్షలాది మంది రోగులకు ఆర్థికంగా సహాయపడుతుందన్నారు.
ఢిల్లీలో అణచివేత తగదు
● బాగేపల్లిలో ఆందోళనలు
బాగేపల్లి: రాజ్యాంగ విరుద్ధమైన ఎస్‌ఐఆర్.ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా శనివారం బాగేపల్లిలో వివిధ సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్ నుంచి ఊరేగింపుగా సీపీఎం, డీవైఎఫ్‌ఐ, ఎస్.ఎఫ్.ఐ నాయకులు, కార్యకర్తలు బయల్దేరారు. ప్రధాని నరేంద్రమోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారని, నిరసనలను అనుమతించకుండా ఢిల్లీని యుద్ధ క్షేత్రంగా మార్చారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని నినాదాలు చేశారు. ఈ దేశపు యువత, విద్యార్థులను అరెస్టు చేయడమే కాకుండా ఉగ్రవాదుల్లా చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్, ప్రధాని మోదీ రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.
కారు దగ్ధం
శివాజీనగర: బెంగళూరు ఇన్‌ఫ్యాంటరీ రోడ్డులో పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ప్రయాణిస్తున్న కారులో మంటలు రేగి దగ్ధమైంది. కారు ఇంజన్ భాగంలో ఆకస్మాత్తుగా మంటలు రాగా, యజమాని షబ్బీర్, మంటలను గమనించిన వెంటనే కారులోంచి బయటకు వచ్చేశాడు. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కొంతసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఎవరికీ హాని కలగలేదు. కొంతసేపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
రేణుకాస్వామి హత్య కేసులో ఎస్‌ఐపై దర్యాప్తు
యశవంతపుర: సంచలనాత్మక చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారడం తెలిసిందే. అప్పట్లో స్థానిక ఎస్‌ఐ వినయ్.. నిందితులకు సహకరించారనే వ్యవహారం చర్చనీయాంశమైంది. వినయ్‌ని కొందరు కేసు నుంచి తప్పించేలా ఉన్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ వంశీకృష్ణ నేతృత్బంలో ఎస్‌ఐ మీద విచారణకు చేస్తున్నారు. వినయ్ సూచనల మేరకు నిందితులు రేణుకాస్వామి మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి పడేశారని ఆరోపణలు రావడంతో అప్పట్లో వినయ్‌ను కేసులో చేర్చారు. తరువాత పేరును తొలగించారు.
సిటీ పబ్బుల్లో తనిఖీలు
బనశంకరి: సంగీతం హోరు, మద్యం కై పులో చిందులు వేస్తున్న టైంలో పోలీసులు రావడంతో యువతీ యువకుల మత్తు దిగిపోయింది. బెంగళూరు నగరంలో శుక్రవారం రాత్రి క్లబ్‌లు, పబ్స్, రెస్టారెంట్లపై పోలీసులు దాడులు జరిపారు. పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు సాగాయి. బాలలను అనుమతించడం, గడువుకు మించి నిర్వహించడం, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంగా సోదాలు సాగించారు. నగరమంతటా వేలాదిగా పోలీసులు పాల్గొన్నారు. పార్టీలు చేసుకుంటున్న జంటలు పోలీసుల రాకతో కంగారుపడ్డారు. కొందరు ఏదో గొడవ జరుగుతోందని గబగబా బయటకు వెళ్లిపోయారు. బ్రిగేడ్ రోడ్డులో మహిళలకు ప్రత్యేకించిన లేడీస్ పబ్‌లోనూ తనిఖీలు చేశారు. మైనర్లు పాల్గొంటున్నారా? అని పరిశీలించారు. అలాగే ప్రముఖ రోడ్లలో వాహన తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పలువురిని పట్టుకున్నారు.
అది ప్రమాదం కాదు, హత్యే
● భూమిక తల్లిదండ్రుల ఫిర్యాదు
యశవంతపుర: బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో యువతి మృతి చెందిన ఘటన కొత్త మలువు తిరుగుతోంది. అది ప్రమాదం కాదు, హత్య చేశారని యువతి కుటుంబం ఆరోపిస్తోంది. వివరాలు.. 3వ తేదీన చన్నపట్టణ్ణ తాలూకా సంకలగెరె సమీపంలోని ఎక్స్‌ప్రైస్ వేలో బెంగళూరు రామోహళ్లికి చెందిన భూమిక అనే యువతి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని చనిపోయిందని కేసు నమోదు కావడం తెలిసిందే.
కానీ ఆమె తల్లిదండ్రులు ఇది యాక్సిడెంటు కాదని, అనేక అనుమానాలున్నట్లు చన్నపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమిక తన స్నేహితుడు కిరణ్‌ను కలవడానికి చన్నపట్టణకు వెళ్లిందని సమాచారం. ఆ సమయంలో గొడవ జరిగి కిరణ్, అతని సోదరుడు కలిసి కొట్టి చంపి నాటకం ఆడుతున్నాడని కిరణ్‌పై ఫిర్యాదులో ఆరోపించారు. కారులో వెళ్లిన భూమిక కారు తాళాన్ని కిరణ్ లాక్కుని డ్రైవర్‌ను బెదిరించినట్లు చెప్పారు.
కేజీఎఫ్ తాలూకాలో భీకర శబ్ధం
కేజీఎఫ్: కేజీఎఫ్ తాలూకా సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం భారీ శబ్దం వినిపించడంతో తాలూకా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో చెవులు మార్మోగేలా చప్పుడు రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలో ఉన్న వారు బయటకు పరుగులు పెట్టారు. తాలూకాలోని కెంపాపురం, మారికుప్పం, క్యాసంబళ్లి రాజపేట రోడ్డు, సుందరపాళ్య, బేతమంగల గ్రామాల పరిధిలో ఈ శబ్దం వినిపించింది. హెలికాప్టర్, లేదా యుద్ధ విమానం అధిక వేగంతో వెళ్లడం వల్ల వచ్చి ఉంటుందని అనుమానాలున్నాయి. గనుల తవ్వకాలకు పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలను వాడి ఉన్నందున కూడా వచ్చి ఉండవచ్చని అనుమానాలున్నాయి. తాలూకా అధికారులు దీనిపై సమాధానం ఇవ్వలేదు.
సహకార సొసైటీలో
ఈడీ సోదాలు
బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాదికారుల ఉద్యోగాల భర్తీ కుంభకోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ బీదర్ జిల్లా బాల్కి పట్టణంలోని ఓం లక్ష్మీ కో–ఆపరేటివ్ సొసైటీలో సోదాలు నిర్వహించింది. నిందితుడు, బ్రోకరు బసవరాజు కన్నాళె అభ్యర్థుల నుంచి నగదు సేకరించి ఈ సొసైటీ ఖాతాల్లో భద్రపరిచాడని ఆరోపణలున్నాయి. గతంలోనూ ఇందులో తనిఖీలు చేశారు. ఈ స్కాంలో సొసైటీ పాత్ర గురించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. మరో నిందితుడు, ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్, సుమారు రూ.49 లక్షలను ఈ బ్యాంకుకు అందించారు. ఎందుకనేది ఈడీ విచారిస్తోంది.
ఎయిర్‌పోర్టులో భిక్షాటన
● క్యూఆర్ కోడ్‌తో వసూళ్లు
యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో క్యూఆర్ కోడ్ పెట్టుకుని యాచిస్తున్న హైటెక్ యాచకుని దందా బయటపడింది. వివరాలు.. ఓ వ్యక్తి ప్రయాణికుల ముందుకెళ్లి తన బ్యాగ్, పర్స్ పోయిందని దీనంగా నటిస్తూ క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడు. కొన్ని గంటల్లోనే ఇలా రోజుకు వేల రూపాయలను వసూలు చేశాడు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతని మీద అనుమానం వచ్చి పట్టుకుని ప్రశ్నించారు. నా పేరు అమీన్ అని, ఢిల్లీ అని చెప్పాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా ఆన్‌లైన్ వేలాది రూపాయలు జమైనట్లు తేలింది. అలాగే బెంగళూరు నుంచి ముంబైకి విమానం టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలిసింది. కానీ డబ్బు కోసం కక్కుర్తితో బోర్డింగ్‌కు కొన్ని గంటల ముందు వచ్చి యాచిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అసలు ఇతని ప్రవృత్తే భిక్షాటన అని, దేశంలో వివిధ నగరాలలో విమానశ్రయాలలో ఇలానే యాచన దందా చేస్తున్నట్లు చెప్పాడు. ఇంకోసారి కనిపిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించి పంపించారు.
పట్టపగ్గాల్లేని పులుల సంతతి
సాక్షి, బెంగళూరు: కన్నడనాట పులుల సంతతి తామరతంపరగా విస్తరిస్తోంది. 2006లో 290 పులులు ఉండేవి. ఆ తర్వాత 2010లో ఆ సంఖ్య 300కు చేరింది. దీంతో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రంగా అప్పట్లో కర్ణాటక నిలిచింది. 2022లో జరిగిన పులి గణనలో మొత్తం 563 పులులు ఉన్నట్లు తేలింది. తాజాగా కర్ణాటక వన్యజీవి సంరక్షణ చరిత్రలో కర్ణాటక మరో మైలురాయిని చేరుకుంది. పులులు 700కు పెరిగాయి. అత్యధిక పులుల సంఖ్య ఉన్న మధ్యప్రదేశ్ తరువాత కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. కానీ పులుల అసహజ మరణాలు, మనుషులపై దాడులు చేయడం వంటి ఘటనలు కలవరానికి కారణమయ్యాయి.
మూడేళ్లలో 30 పులులు మృతి
గత మూడేళ్లలో రాష్ట్ర అటవీ ప్రాంతంలో సుమారు 30కి పైగా పులులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరెంటు షాక్‌లు, విష సేవనం, పులుల మధ్య కొట్లాటలు, వేట వంటివి కారణాలుగా ఉన్నాయి. పొలాల్లోకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగులుకుని చనిపోతున్నాయి. మరికొన్ని ఆకలితో అలమటించి ప్రాణాలు విడుస్తున్నాయి. కొన్ని నెలల కిందట చామరాజనగర జిల్లాలో తల్లి పులి, 4 పిల్లలకు కొందరు విషం కలిపిన మాంసం పెట్టి హతమార్చడం తెలిసిందే.
విశాలమైన స్థలాలే కావాలి
వన్యజీవుల నిపుణుల ప్రకారం పులులు ఒంటరిగా జీవిస్తాయి. ఓ ఆడ పులికి సామాన్యంగా 10 నుంచి 15 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అవసరం అవుతుంది. కానీ మగ పులులకు సుమారు 50 నుంచి 500 చదరపు కిలోమీటర్ల స్థలం కావాలి. ఆహారం, నీరు, సురక్షిత ఆవాసం కోసం వాటికి విశాలమైన అటవీ ప్రాంతం అవసరం. పులుల సంఖ్య పెరిగే కొద్దీ వాటి నివాస స్థలాల కోసం గొడవలు సంభవిస్తాయి. ఈ పోట్లాటల్లో ఓడిన పులులు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటూ జనావాసాల్లోకి రావడం, లేదా ఆకలితో చనిపోవడం జరుగుతోందని తెలిపారు. జనావాసాల్లోకి వస్తే ప్రజలు, పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
అరణ్యాలు అంతంతే
మధ్యప్రదేశ్‌లో విశాలమైన అటవీ ప్రాంతం ఉండడంతో వ్యాఘ్రరాజులకు కాస్త సురక్షితంగా ఉంటున్నాయి. కర్ణాటకలో బండీపుర, నాగరహోళె, బిళిగిరి రంగనబెట్ట, భద్రా, కాళి వంటి పులి అభయారణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే కాకుండా ఇరుగుపొరుగు అడవులకు కూడా పులులు వలస వెళుతున్నాయి. అటవీ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించి చదును చేయడం వల్ల అడవులు తరిగిపోతూ పులుల ఆవాసం క్షీణిస్తోంది. అటవీ ప్రాంతాలను కలుపుతూ ఉండే ప్రదేశాలు నాశనం అయితే పులుల సంచారానికి కష్టంగా మారుతుంది. దీనివల్ల కొత్త ప్రాంతాలను వెతుకుతూ జనావాసాల్లోకి పులులు వచ్చే ప్రమాదం ఉంది.
మానవులతో ఘర్షణ
పులుల సంఖ్య ఒకవైపు పెరుగుతుంటే మరోవైపు అటవీ ప్రాంతాలను ఆనుకుని జీవించే గ్రామస్తుల భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల మైసూరు జిల్లాలో పొలంలో రైతును బలిగొంది. పల్లెల్లోకి పులులు వచ్చి ఎన్నో మూగ జీవులను బలి తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 6,500పై పశువులు, మూగజీవాలను పులులు బలి తీసుకున్నాయి. పులుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.
శివాజీనగర: రాష్ట్రంలో స్థానిక నాయకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జిల్లా పంచాయితీ, తాలూకా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా రిజర్వేషన్ల ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. అభ్యంతరాలను సమర్పణకు ప్రజలకు 10 రోజుల గడువు ఇచ్చింది. స్వయంగా గానీ లేదా తపాలా ద్వారా గానీ విధానసౌధలోని పంచాయతీరాజ్ శాఖ ఆఫీసులో ఇవ్వవచ్చు. రాష్ట్రంలోని 31 జడ్పీలలో 1,129 సీట్లు, టీపీలలో 3,656 సీట్లు కేటాయించారు. వీటిలో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. ఈ జాబితాను ఈసీకి పంపగా, పచ్చజెండా ఊపిన వెంటనే ప్రభుత్వం ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అభ్యంతరాల పరిశీలన తరువాత తుది ప్రకటనను జారీ చేస్తుంది. సర్ ప్రక్రియ ముగిశాక తుది ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ఎన్నికలు జరపాలని సర్కారు యోచిస్తోంది. ఇవి ముగిసిన వెంటనే గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహిస్తారు.
రాష్ట్రంలో 700 దాటిన వ్యాఘ్రాలు
దేశంలోనే రెండవ స్థానం
చాలని అడవులతో పులుల సతమతం
సౌజన్య కేసులో మలుపు
బనశంకరి: ధర్మస్థల వద్ద తీవ్ర సంచలనం సృష్టించిన పీయూసీ విద్యార్థిని సౌజన్య అనుమానాస్పద మృతి కేసులో సిట్ అధికారి టి.జయంత్ సీల్డ్ కవర్‌లో ఉన్నతాధికారులకు ఓ నివేదికను అప్పగించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ సౌజన్య పై అత్యాచారం, హత్య కేసులో ముఖ్యమైన సమాచారంతో పాటు కొందరు ప్రముఖ వ్యక్తుల పేర్లు ప్రస్తావించానని తెలిపారు. వీరిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టవచ్చు, లేదా సాక్షులుగా పరిగణించి దర్యాప్తు చేయవచ్చు అని చెప్పారు. తన నివేదికలోని వ్యక్తులను సక్రమంగా విచారిస్తే
పూర్తి నిజనిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. జయంత్ ఇచ్చిన నివేదికపై అందరిలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసును పునర్‌విచారణ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. బెళ్తంగడిలో ఆమె కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా అదృశ్యం కావడం, అడవిలో శవమై తేలడం ఇప్పటికీ మిస్టరీగా ఉంది.


