సాక్షి, బళ్లారి: శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతో అవసరమని సీనియర్ అధ్యాపకుడు గోవింద్ పేర్కొన్నారు. శనివారం సండూరు తాలూకాలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందిహళ్లి పీజీ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు, రన్నింగ్, వాకింగ్ తదితర శారీరక శ్రమతో కూడిన అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పరుగు పందెంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పీజీ కేంద్రం డైరెక్టర్ తిప్పేస్వామి, ప్రముఖులు సంపత్ కుమార్, పంపన గౌడ, శివ కుమార్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


