బళ్లారి అర్బన్: బళ్లారి నగర ఆరాధ్య దైవం కనక దుర్గమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి 21 వరకు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మేయర్, ఆలయ పూజారి గాదెప్ప యాదవ్ తెలిపారు. శనివారం కనక దుర్గమ్మ ఆలయంలోని యాత్రి నివాస్‌లో విలేకరులతో మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు, సహస్త్ర నామ పారాయణం, దేవి పురాణం, భజనలు, సంగీత నృత్య నాటక ప్రదర్శనలు జరగుతాయన్నారు. విజయ దశమి రోజున సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ప్రధాన పల్లకీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆలయం రాజగోపురంతో పాటు నాలుగు గోపురాలు, నగరంలోని ఎస్‌వీ సర్కిల్ నుంచి రాయల్ సర్కిల్, కనక దుర్గమ్మ ఆలయం, మోకా రోడ్డు, కప్పగల్ రోడ్డు వరకు విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రూపాల్లో అలంకరణకు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. 11న శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కుస్మాండ, 15న స్కంధ దేవి, 16న ఖ్యాతాయని, 17న కలారాత్రి, 18న మహాగౌరి, 19న సిద్దిదాత్రి, 20న సరస్వతి దేవి, 21న ఆదిశక్తి రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారన్నారు. ఈ ఏడాది విజయ దశమి రోజున రావణ దహనానికి బదులుగా బాణాసంచా కాల్చే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో దేవస్థాన ఈఓ సెల్వమణి, అర్చకులు రామాంజినేయలు, లక్ష్మణ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సన్న దుర్గమ్మ ఆలయంలో సర్వం సిద్ధం..
బళ్లారి అర్బన్: బళ్లారిలోని పటేల్ నగర్ అద్దినగుండా రోడ్డు దుర్గా కాలనీలో వెలసిన సన్న దుర్గమ్మ ఆలయంలో 20 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ తెలిపారు. 11న బాలత్రిపుర సుందరి దేవి, 12న లక్ష్మీ నరసింహా స్వామి, 13న లలితా దేవి, 14న వారాహి దేవి, 15 అన్నపూర్ణేశ్వరి దేవి, 16న మహాలక్ష్మీ దేవి, 17న సరస్వతి దేవి, లక్ష కుంకుమార్చన, 18న దుర్గా దేవి, 19న చండీ దేవి, 20న విజయ దశమి సందర్భంగా సన్న దుర్గమ్మగా అలంకరించడం జరుగుతుందన్నారు. 15న జరిగే సత్యనారాయణ స్వామి పూజల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హనుమంతప్ప, తిప్పణ్ణ, వెంకటేష్, కృష్ణ కిట్టు, ఎర్రిస్వామి, సునిల్, ప్రకాశ్, సంతోష్ స్వామి పాల్గొన్నారు.
చెళ్లకెర నగరంలో..
చెళ్లకెర రూరల్: నగరంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నట్లు వాసవీ యువజన సంఘం అధ్యక్షుడు కార్తీక్ అనంత్ తెలిపారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ధర్మభారతి కార్యదర్శి ఆదర్శ గోఖలే విచ్చేస్తారన్నారు. అమ్మవారు ఆభరణ లక్ష్మి, అన్నపూర్ణేశ్వరి దేవి, కదలియల్లి వాసవీ, దర్బార్ లక్ష్మి, బ్రహ్మణి దేవి, లలితా దేవి, చాముండేశ్వరి దేవి, మహిషాసుర మర్దిణి, రజతాంగి అలంకరణలో దర్శనమిస్తారని పేర్కొన్నారు. దేవాలయంలో కుంకుమార్చన సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, భజనలు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్వాన్ గోపాలకృష్ణ స్వామి, ఎంఎస్ బాలాజీ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, వాసవీ యువజన సంఘం ఉపాధ్యక్షుడు డీవీ.అభిషేక్, కార్యదర్శి ఎం.రాఘవేంద్ర గుప్తా, సహ కార్యదర్శి ఎన్.రవికుమార్, శ్రీహరి గుప్తా, పీ.రాకేష్, బి.రాజేష్, నవీన్, అజిత్ గుప్తా, జీఆర్ గగన్, టీ.ఎస్.వరుణ్, ఎస్.వికీల్ పాల్గొన్నారు.
ఆలయాల్లో దసరా
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి 21 వరకు ఉత్సవాలు
విద్యుత్ వెలుగుల్లో
కాంతులీనుతున్న ఆలయాలు


