ఎవరీ గవి సిద్ధేశ్వర స్వామి? | - | Sakshi
Sakshi News home page

ఎవరీ గవి సిద్ధేశ్వర స్వామి?

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

మైసూరు: ప్రఖ్యాత నాడ హబ్బ మైసూరు విజయదశమి శరన్నవరాత్రి వేడుకలు నేడు ఆదివారం చాముండి కొండపై ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం చాముండి గిరులతో పాటు ప్యాలెస్‌ సిటీ మైసూరును మనోహరంగా సింగారించారు. ఎటుచూసినా విద్యుద్దీపాలంకరణతో నగరం విరాజిల్లుతోంది.

11:50 నుంచి శుభ ముహూర్తంలో

ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:13 గంటల మధ్య పవిత్రమైన ధనుర్‌ లగ్నంలో వెండి రథంలో కొలువైన చాముండేశ్వరి అమ్మవారికి విశేష పూజలు చేయడం ద్వారా ఉత్సవాలకు నాంది పలుకుతారు. ఈ ఏడాది ఉత్సవ అతిథిగా కొప్పళ గవిమఠాధిపతి అభినవ గవి సిద్ధేశ్వర స్వామి అగ్రపూజలు నిర్వహిస్తారు. ఆయన వెంట ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, డీసీఎం పరమేశ్వర్‌, జిల్లా డా.యతీంద్ర సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. అలాగే ఈ ఏడాది ప్రారంభ వేడుకకు సీఎం వివిధ మఠాధిపతులను ఆహ్వానించారు. మధ్యాహ్నం వరకు చాముండి కొండల్లోకి భక్తులు, ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశారు.

నగరంలో విశేష వేడుకలు

అదే సమయంలో మైసూరు నగరంలో కుప్పన్న పార్కులో ఉదయం 11:30 గంటలకు దసరా పుష్ప ప్రదర్శన ప్రారంభమవుతుంది. అగ్రహార డాన్స్‌ స్కూల్‌లో పుస్తక ప్రదర్శన, మహారాజా కళాశాల మైదానంలో ఆహార పండుగ మొదలవుతాయి. సాయంత్రం 4 గంటలకు, దేవరాజ అరసు స్టేడియంలో కుస్తీ పోటీలు అలరించనున్నాయి. వివిధ వేదికలలో పుస్తకాల ప్రదర్శన, హస్తకళా శిబిరం, దసరా సీఎం కప్‌ క్రీడా పోటీలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 5 గంటలకు, ప్యాలెస్‌ ముందు వేదికపై దసరా సాంస్కతిక ప్రదర్శనలు కళాప్రియులను ముగ్ధుల్ని చేయనున్నాయి. ఇందులో రుక్మిణి విజయకుమార్‌కు రాష్ట్ర సంగీత విద్వాన్‌ పురస్కారాన్ని సీఎం ప్రదానం చేస్తారు.

నేటి నుంచి విజయదశమి మహోత్సవాలు

కొప్పళ గవిసిద్ధేశ్వరస్వామిచే ప్రారంభం

హాజరవుతోన్న సీఎం, మంత్రులు

చాముండి గిరులు, మైసూరు నగరం ముస్తాబు

నిరుపేద కుటుంబం నుంచి

కొప్పళ మఠాధిపతిగా..

వేలాది పోలీసులతో భద్రత

ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా వేలాదిగా పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇంకా పలురకాల సాయుధ బలగాల సిబ్బందిని మోహరించారు.

ప్రజలు, భక్తులు సంవత్సరమంతా ఎదురుచూసే మైసూరు దసరా మహోత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఆధ్యాత్మిక వైభవం, వినోద, కళా సాంస్కృతిక సౌరభాలను వెదజల్లే మేలి కలయికతో సంబరాలు 11 రోజులు ఆబాలగోపాలాన్నీ రంజింపచేయబోతున్నాయి.

మైసూరు: దసరా ఉత్సవాల ప్రారంభించే ముఖ్య అతిథి కొప్పళలోని గవిమఠం సంస్థానం గవి సిద్ధేశ్వర మహాస్వామీ శనివారం మైసూరుకు చేరుకున్నారు. ఎంతోమంది లబ్ధప్రతిష్టులను కాదని డీకే సర్కారును ఆయననే ఎంపిక చేసింది. అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తరువాత సుత్తూరు మఠాన్ని సందర్శించారు. కాగా, అభినవ గవిసిద్ధేశ్వర మహాస్వామిగా పేరుగాంచిన ఆయన 1977లో కలబుర్గి జిల్లా హాగరగుండగి గ్రామంలో ఒక సామాన్య వీరశైవ లింగాయత్‌ కుటుంబంలో జన్మించారు. పర్వతాయ హిరేమఠ అని తల్లిదండ్రులు పేరుపెట్టారు. పేదరికం వల్ల బడిలో కొనసాగలేకపోయేవాడు. 1989లో తమదాది మఠం శివశంకర్‌ స్వామి ఆ గ్రామానికి వచ్చినప్పుడు హిరేమఠను చూశారు. మంచి చదువులు చదివిస్తానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి గదగ్‌ జిల్లాలోని ముండరగిలోని శ్రీ అన్నదానేశ్వర మఠం పాఠశాలకు తీసుకెళ్లారు. దారిలో బస్సు మిస్సయింది, దీంతో ఓ ప్రయాణికుడు ఆ రాత్రి కొప్పళలోని గవిమఠంలో బస చేయమని సూచించారు. కొప్పళ మఠాధిపతి శివశాంతవీర మహాస్వామి, మఠానికి వచ్చిన ఆ బాలుడిని గమనించి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. తరువాత గవిమఠం పాఠశాలలోనే చేరారు. గుల్బర్గా వర్సిటీ నుంచి బీఏ, పూణె వర్సిటీలో తత్వశాస్త్రం, తిరుపతిలో సంస్కృతం, ఆంగ్లంలో పీజీ కోర్సులను పూర్తి చేశారు. ఆపై మఠం సేవకే నిమగ్నమై క్రమక్రమంగా నేటి స్థానానికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement