బనశంకరి: రాష్ట్రంలోని కరావళి తీర ప్రాంతంలో చేపలవేట ప్రధాన వృత్తి. ప్రతిరోజు జాలర్లు చేపలు పట్టడానికి లోతైన అరేబియా సముద్రంలోకి వెళతారు. కానీ సముద్రంలో చేపలు పడుతుండగా పడవలు ప్రమాదాల్లో చిక్కుకుని చాలామంది జాలర్లు ప్రాణాలు కోల్పోయారు. గత మూడేళ్లలో 215 మంది జాలర్లు మృత్యువాత పడ్డారు. తీర ప్రాంత పంచాయతీల్లో అధిక సంఖ్యలో మత్య్సకారులు ఉన్న గ్రామాల్లో పోస్టర్లు, కరపత్రాలతో హెచ్చరిక నోటీసులు అతికిస్తారు. మత్య్సకారులు తమ పడవల భద్రత కోసం ఇస్రో అభివృద్ధి చేసిన జీపీఎస్ ఆధారిత వ్యవస్థను అన్ని యాంత్రిక చేపల పడవల్లో అమరుస్తున్నారు. దీని వల్ల సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మత్స్యకారులకు ప్రాణాపాయ పరిస్థితులు లేదా పడవ ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయక బృందాలు తక్షణం సమాచారం అందిస్తాయి. అలాగే ప్రమాదంలో ఉన్న మత్స్యకారులకు సహాయక బృందాలు సమాచారాన్ని చేరవేస్తాయి.
మత్స్యకారుల భద్రతకు చర్యలు
ప్రస్తుత సంవత్సరంలో సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి, అవసరమైన వైద్యసేవలు అందించడానికి ఒక సముద్ర అంబులెన్స్ సేవ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లే పడవల్లో మత్స్యకారుల సంఖ్యను బట్టి లైఫ్ జాకెట్లు, లైఫ్‌బాయ్ వంటి ప్రాణరక్షక పరికరాలు తప్పనిసరిగా ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత మత్స్యశాఖ వారికి లైసెన్సులు జారీ చేస్తుంది. ప్రాణరక్షక పరికరాల వినియోగం గురించి మత్స్యకారులకు అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాతావరణ అంచనా నివేదికలు, ప్రజా సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా ముఖ్యంగా మత్స్యకారులను చేరుకోడానికి వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. చేపల రేవుల్లో పడవలు దించే కేంద్రాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, సామాజిక మాధ్యమాల్లో మత్స్యకారుల వ్యక్తిగత సెల్‌ఫోన్ నెంబర్లకు ముందుజాగ్రత్త సందేశాలు చేరవేస్తారు.
లైఫ్‌జాకెట్ల పంపిణీ లెక్కలివే..
2023–24లో 2,030 లైఫ్‌జాకెట్లు పంపిణీ చేయగా, 2024–25లో 2,545 లైఫ్‌జాకెట్లు, 2025–26లో 2,466 లైఫ్‌జాకెట్లు పంపిణీ చేశారు. 2026–27వ సంవత్సరానికి రాష్ట్రంలోని మత్స్యకారులకు పరికరాల కిట్ల పంపిణీ కోసం రూ.6.4 కోట్లు కేటాయించారు. జిల్లాలో వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నిధులను బట్టి లైఫ్‌జాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక లైఫ్‌జాకెట్ ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉంది. డిమాండ్, నిధుల లభ్యతకు అనుగుణంగా లైఫ్ జాకెట్లను కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి నిబంధనల ప్రకారం టెండర్‌ప్రక్రియ చేపడతారు. లైఫ్‌జాకెట్ మన్నిక దాని వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నాలుగైదేళ్ల పాటు పని చేస్తుందని మత్స్యశాఖ తెలిపింది.
మంగళూరు తీరంలో మునుగుతున్న బోటులో నుంచి
మత్స్యకారులను కాపాడుతున్న దృశ్యం
అరేబియా సముద్రంలో ఉళ్లాల తీరానికి సమీపంలో బోల్తా పడిన మత్స్యకారుల బోటు
మత్స్యకారుల మరణాలు
2023–24లో దక్షిణ కన్నడలో 4, ఉడుపిలో 27 మంది, ఉత్తర కన్నడలో 26 మంది కలిపి మొత్తం 57 మంది మత్స్యకారులు మృతిచెందారు. పరిహారంగా దక్షిణ కన్నడలో రూ.24 లక్షలు, ఉడుపిలో రూ.1.62 కోట్లు, ఉత్తర కన్నడలో రూ.1.56 కోట్లు కలిపి మొత్తం రూ.3.42 కోట్లు పంపిణీ చేశారు. 2024–25లో దక్షిణ కన్నడలో 4, ఉడుపిలో 23 మంది, ఉత్తర కన్నడలో 29 మంది కలిపి మొత్తం 56 మంది మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. పరిహారంగా దక్షిణ కన్నడలో రూ.34 లక్షలు, ఉడుపిలో రూ.1.76 కోట్లు, ఉత్తర కన్నడలో రూ.2.24 కోట్లు కలిపి మొత్తం రూ.4.34 కోట్లను పంపిణీ చేశారు. 2025–26లో దక్షిణ కన్నడలో 5, ఉడుపిలో 40 మంది, ఉత్తర కన్నడలో 57 మంది కలిపి మొత్తం 102 మంది మృతి చెందారు. పరిహారంగా దక్షిణ కన్నడలో రూ.36 లక్షలు, ఉడుపిలో రూ.3.18 కోట్లు, ఉత్తర కన్నడలో రూ.4.84 కోట్లు కలిపి మొత్తం రూ.8.38 కోట్లను పంపిణీ చేశారు.
మూడేళ్లలో అరేబియా సముద్రంలో
215 మంది జాలర్ల మృత్యువాత
మత్స్యకారులకు సముద్ర అంబులెన్స్ సేవ ఏర్పాటుకు చురుగ్గా పనులు


