మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి | - | Sakshi
Sakshi News home page

మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

● ఇద్దరు నిందితులకు జైలు శిక్ష

దొడ్డబళ్లాపురం: మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించిన ఇద్దరు నిందితులకు రామనగర కోర్టు కఠిన శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు లోకేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, రెండో నిందితుడు గురుప్రసాద్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ బెంగళూరు దక్షిణ జిల్లా 1వ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. 2020 అక్టోబర్‌లో కుదూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిందితులు మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి మొబైల్‌లో ఆ దృశ్యాలను వీడియో తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. కేసు విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో పైమేరకు తీర్పునిచ్చింది.

సర్‌లో 1.1 లక్షల

అర్జీల అందజేత

బనశంకరి: కర్ణాటక రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఓటర్లు జాబితా నుంచి పేర్లు తొలగించడం లేదా అభ్యంతరం తెలపడానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1,10, 654 ఫాం–7 దరఖాస్తులు అందించారు. దీనిపై కర్ణాటక ఎన్నిక అధికారుల కార్యాలయం అధికారికంగా వివరాలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 23 లక్షలకు పైగా వివిధ దరఖాస్తులు ఫాం– 6, 6ఏ, 7, 8 అందజేయగా, అందులో ఓటర్ల పేర్లు తొలగించాలని కోరుతూ ఫాం–7 దరఖాస్తులకు గాను శివమొగ్గ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కన్నడ జిల్లా రెండో స్థానంలో ఉంది. కొందరు దురుద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ఫాం–7 దరఖాస్తులు నకిలీవి అందించినట్లు ఫిర్యాదులు అందాయని, వీటిపై అధికారులు సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

ఆ నోటిఫికేషన్‌ చెల్లదు

● అంజనాద్రి ఆలయ నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు

● ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు,

సర్కారుకు ఎదురుదెబ్బ

సాక్షి,బళ్లారి: సాక్షాత్తు హనుమంతుడి జన్మస్థానంగా కీర్తి పొందిన కొప్పళ జిల్లాలోని గంగావతి సమీపంలోని అంజనాద్రి కొండ ఆలయ నిర్వహణకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయాన్ని మతపరమైన దత్తి చట్టం పరిధిలోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. సంబంధితులకు తగిన నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారనే కారణంతో న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 2018 సెప్టెంబర్‌ 24న ఆలయాన్ని చట్టం పరిధిలోకి తీసుకుని వస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు అదే ఏడాది డిసెంబర్‌ 15న ఆలయానికి పరిపాలనాధికారి, కార్యనిర్వహణాధికారిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆలయాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వచ్చే ముందు సంబంధిత వ్యక్తులకు నోటిఫికేషన్‌ ఇచ్చారా? వారి అభిప్రాయాలను, వాదనలను వినిపించే అవకాశం కల్పించారా? అనే అంశాలను న్యాయస్థానం ప్రశ్నించింది. సంబంధిత వ్యక్తుల వాదనలు వినకుండా నోటిఫికేషన్‌ జారీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలుతో పాటు అధికారుల నియామక ఉత్తర్వులను రద్దు చేసింది. హనుమంతుడి జన్మస్థానంగా ప్రసిద్ధి చెందిన అంజనాద్రి కొండ హనుమంతుడి జన్మస్థానంగా చరిత్ర ఆధారాలు చెబుతున్న తరుణంలో దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. 575 మెట్లు కలిగిన కొండపైన శ్రీఆంజనేయ స్వామిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఆలయంలో పూజల నిర్వహణకు సంబంధించిన వివాదం నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement