మైసూరు: హెచ్.డీ.కోటె నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి మైసూరు వైపు నుంచి వస్తున్న ఒక బైక్‌ను, ఆ తర్వాత రోడ్డు పక్కన నిలబడి ఉన్న పాదచారులను ఢీకొట్టడంతో బైకర్‌తో సహా ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జిల్లాలోని హెచ్.డీ.కోటె తాలూకాలో మైసూరు–మహానందవాడి రోడ్డులోని పుర వద్ద జరిగింది. మృతులను బీజాపూర్‌కు చెందిన సచిన్, గోవింద్, రాథోడ్‌లుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమిత్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. మృతులు, గాయపడిన వ్యక్తి జేసీబీ పని మీద బీజాపూర్ జిల్లా నుంచి వచ్చారని సమాచారం. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంతో కొంతసేపు ఆ రోడ్డులో వాహన సంచారానికి అంతరాయం వాటిల్లింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, గాయపడిన వారికి చికిత్స అందించడంలో సహాయపడ్డారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు మార్చురీకి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. హెచ్.డీ.కోటె పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కారు, క్యాంటర్ ఢీ
నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: ధార్వాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, క్యాంటర్ ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హుబ్లీ వైపు నుంచి వస్తున్న కారు నవలగుంద తాలూకాలోని అమరగోళ క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన క్యాంటర్‌ను ఢీకొంది. రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతులను విజయపురకు చెందిన అజిత్(38), రాకేష్(22), సందీప్(33)తో పాటు సాగర తాలూకా శిరవాళ గ్రామానికి చెందిన శృతి(28)గా గుర్తించారు. ప్రమాదంలో ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం


