శివమొగ్గ: నగర శివార్లలోని దుమ్మళ్లి గ్రామానికి చెందిన ఒక రైతు తేనెటీగలు కుట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరణించిన ఘటన జరిగింది. మృతుడిని తిమ్మానాయక్ (56)గా గుర్తించారు. ఈనెల 7న అతను తన మొక్కజొన్న పొలంలో పని చేస్తుండగా, తేనెటీగల గుంపు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి కుట్టాయి. తీవ్ర అస్వస్థతకు గురైన తిమ్మానాయక్‌ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శివమొగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. తిమ్మానాయక్ వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేశాడు. పేద రైతు అకాల మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది. ఈనేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


