పాల పొడి కేసును సీబీఐకి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పాల పొడి కేసును సీబీఐకి ఇవ్వాలి

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

గ్యాస్‌ పేలుడులో..

తల్లీ బిడ్డ మృతి

బనశంకరి: బెంగళూరు నాయండహళ్లి వినాయకలేఔట్‌ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు, నలుగురు పిల్లల్లో ఇద్దరు మరణించారు. తల్లి లక్ష్మమ్మ, మూడేళ్ల కవలు కూతుళ్లలో ఒకరు విక్టోరియా ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. 4 రోజుల కిందట ఇంట్లో వంట కోసం స్టవ్‌ అంటించే సమయంలో విస్ఫోటం సంభవించి కుటుంబం మొత్తానికి కాలిన గాయాలు కావడం తెలిసిందే. బాధితులు రాయచూరు జిల్లాకు చెందిన వలస కూలీలు. మిగతా నలుగురికి చికిత్స సాగుతోంది. తీవ్ర గాయాలతో ఉన్న ముగ్గురు పిల్లలకు తల్లి మరణం గురించి కూడా తెలియదు. బంధువులు బోరున విలపించారు.

నైస్‌ అక్రమ టోల్‌

వసూలు: కుమారస్వామి

శివాజీనగర: నైస్‌ పథకంపై దేవెగౌడ 25 ఏళ్ల పోరాటానికి తార్కిక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. 2000లో టోల్‌ ఒప్పందం కుదిరిందని, 2008 నుంచి టోల్‌ రుసుమును అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం బెంగళూరులో జేడీఎస్‌ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వానికి, నైస్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో అగ్రిమెంట్‌, టోల్‌ ఎలా వసూలనేది, షరతులు అనే మూడు భాగాలున్నాయని తెలిపారు. నైస్‌ సంస్థ 163 కిలోమీటర్ల రహదారికి 6,999 ఎకరాలు అడగడం విచారకరమన్నారు. గతేడాది సుప్రీంకోర్టు ఇదంతా పరిశీలించి, ఒక మోసం అని పరోక్షంగా చెప్పిందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. ఈ మోసానికి ఎవరు పాల్పడ్డారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. 2023లో నైస్‌ రోడ్‌ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సభా కమిటీ చైర్మన్‌ టీ.బీ.జయచంద్ర సిఫార్సు చేశారన్నారు. కానీ 2025లో ఆ ప్రాజెక్టును కొనసాగించాలని ఆయనే లేఖ రాశారని, ఎందుకో తెలియదని అన్నారు.

4 గంటలు నిలిచిన రైళ్లు

దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ – బెంగళూరు మార్గంలో నూతన మార్గం నిర్మాణ పనుల వల్ల ప్రముఖ రైళ్లకు అంతరాయం కలిగింది. బెంగళూరు నుంచి బెళగావికి వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో పాటు మొత్తం 4 రైళ్లు మార్గం మధ్యలోనే 4 గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. దావణగెరె తాలూకా మాయకొండ రైల్వేస్టేషన్‌కి వచ్చిన వందేభారత్‌ రైలు 4 గంటలపాటు నిలిచిపోయింది. బెంగళూరు నుంచి వస్తున్న 3 రైళ్లు కూడా కొడగనూరు, సాసలు, శివని స్టేషన్‌లలో నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు. నీరు, ఆహారం కోసం అంగలార్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్‌ చేశారు.

మండ్య: మండ్య జిల్లా డెయిరీ మన్‌ముల్‌లో పాల పొడి కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. డెయిరీ ఉద్యోగులు రూ.3 కోట్ల పాలపొడిని అమ్మేసుకుని, దాని స్థానంలో రూ.30 లక్షల కల్తీ పాలపొడిని ఉంచారని కేసు నమోదు కావడం తెలిసిందే. మద్దూరు తాలూకా గెజ్జలగెరె పాల ఒక్కోట వద్ద బైఠాయించారు. స్వాహాకు పాల్పడిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. పాల పొడిని విసురుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మన్‌ముల్‌ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

చర్యలు తీసుకుంటాం: మంత్రి

నాణ్యత లేని పాల పొడి కేసులో ఎవరిని ఉపేక్షించేది లేదని, కేసులో యాజమాన్య మండలి పాత్ర ఉన్నట్లు తేలితే రద్దు చేయడానికి కూడా సిద్ధమని జిల్లా ఇంచార్జి మంత్రి ఎన్‌.చెలువరాయస్వామి తెలిపారు. జడ్పీ హాల్‌లో ఆయన రైతు నేతలతో మంత్రి సమావేశమై మాట్లాడారు. కేసును మూసివేయాలంటూ కొందరు తనను కలిశారని, కానీ పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చెప్పానన్నారు. సంస్థ మాజీ అధ్యక్షున్ని అరెస్టు చేసినట్లు, డైరెక్టర్ల పాత్ర ఉంటే వారిని కూడా వదిలేది లేదని హెచ్చరించారు.

వచ్చే ఏడాది మేకెదాటుకు శంకుస్థాపన

వచ్చే ఏడాది మేకెదాటు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పారు. కేంద్రానికి సవివర నివేదికలను సమర్పించినట్లు, కేంద్ర జల మంత్రి తో కూడా మాట్లాడినట్లు, త్వరలోనే అన్ని అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులకు ప్రకటించిన రూ. 2500 కరువు పరిహారం తాత్కాలికమేనని, కేంద్ర సాయం అందాక మరింత భరోసా ప్రకటిస్తామని తెలిపారు. కేంద్ర బృందాలు అధ్యయనం చేశాక, పరిహారంపై ప్రకటన వెలువడవచ్చన్నారు.

మండ్య డెయిరీ ముందు

ఆందోళనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement