మైసూరు: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మైసూరు దసరా సంబరాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దసరా రోజున పేల్చే ఫిరంగుల సాధన బుధవారం ఉత్సాహంగా జరిగింది. ఏనుగులకు దగ్గగా పోలీసులు ఫిరంగులను పేల్చారు. ఆ భారీ శబ్ధాలకు ఏనుగులు అలవాటు పడడమే ఈ సాధన ఉద్దేశం. వస్తుప్రదర్శన మైదానంలో 13 ఏనుగులను నిలబెట్టి నగర ఆర్మ్‌డ్ పోలీసులు 7 ఫిరంగుల్లో మందుగుండు పెట్టి పేల్చారు. 21 రౌండ్లు పేల్చడంతో భారీ శబ్ధంతో పాటు దట్టమైన పొగ అలముకుని యుద్ధక్షేత్రాన్ని తలపించింది. అశ్వదళానికి చెందిన 43 గుర్రాలు, ఏనుగులు ఏమాత్రం బెదరకుండా నిలబడ్డాయి. పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, ఈసీపీ హర్ష ప్రియంవద తదితరులు పాల్గొన్నారు.
ఫుల్ డ్రెస్ రిహార్సల్
మరోవైపు ఏనుగులను దుస్తులతో సింగారించి ప్యాలెస్ నుంచి బన్నిమంటప వరకు పాదయాత్ర చేయించారు. రంగురంగుల వస్త్రాల్లో ఏనుగులు రావడంతో ప్రజలు, టూరిస్టులు సంభ్రమానికి గురయ్యారు. మరోవైపు యువ సంభ్రమలో నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
మైసూరులో ఉత్సాహంగా సాధన


