దొడ్డబళ్లాపురం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ప్రాణాలు తీశాడో కిరాతకుడు. సంతానం కలగలేదని గొడవలు వచ్చి భార్యను హత్య చేసిన సంఘటన కలబుర్గి జిల్లా చించోళి పట్టణంలో జరిగింది. వివరాలు.. ప్రియాంక (30), భర్త సూర్యకాంత్ (35) దంపతులు. భర్త మొదటి నుంచీ అధిక కట్నం తీసుకురావాలని వేధించేవాడు. ఎంతకాలమైనా పిల్లలు పుట్టకపోవడంతో మరింతగా సతాయించేవాడని ప్రియాంక తల్లిండ్రులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఆమెను గొంతు పిసికి హత్య చేశాడు. అయితే ప్రియాంక ఆత్మహత్య చేసుకుందని నాటకమాడినా పోలీసుల విచారణలో నిజం అంగీకరించాడు. అతనిని అరెస్టు చేశారు.
కోర్టు విచారణ లీక్
బనశంకరి: నటీనటులు పవిత్రగౌడ, దర్శన్ నిందితులుగా ఉన్న చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో బెంగళూరు కోర్టులో రోజువారి విచారణ సాగుతోంది. అప్రూవర్ ప్రదోష్ వాంగ్మూలం రోజూ రికార్డు చేస్తున్నారు. రేణుకాస్వామి హత్య ఎలా జరిగింది అనేది అతడు చెబుతున్నాడు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు బయటకు లీకయ్యాయి. ఎవరో మొబైల్‌ఫోన్‌లో తీసి వైరల్ చేయడం గమనార్హం. తీవ్రంగా పరిగణించిన కోర్టు వాటిని ప్రసారం చేసిన యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ తదితరాలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ సమాచారాన్ని తొలగించారు. విచారణ దృశ్యాలను రికార్డు చేయకూడదని ఆదేశించింది.
నడివీధిలో కత్తులతో దాడి
కృష్ణరాజపురం: బెంగళూరులో పట్టపగలే కత్తులతో దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ బాలుడు, రియాన్‌ఖాన్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, షురైమ్, యూసోఫా, హుజైఫా, నియామత్ అనేవారు దాడి చేశారు. కేజీ హళ్లిలోని కుశాల నగర 9వ క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడు, రియాన్ ఖాన్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కేజీ హళ్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. పాత కక్షలే కారణమని తెలుస్తోంది.
స్టింగ్ ఆపరేషన్లపై సీఎం చెప్పాలి
● విజయేంద్ర డిమాండ్
శివాజీనగర: కొందరు మంత్రులపై స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని సీఎం డీకే శివకుమార్ ఆరోపించడంపై బీజేపీ భగ్గుమంది. స్టింగ్ ఆపరేషన్లు, బ్లాక్‌మెయిలింగ్‌ల చరిత్ర ఎవరికి ఉందో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. బుధవారం గదగ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏయే ఏజెన్సీలు ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయో సీఎం డీకే రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కోరారు. మంత్రులను మొబైల్‌ఫోన్లు స్విచాఫ్ చేసుకోవాలని, తలుపులు మూసుకోమని, లంచాలు ఇవ్వమని చెప్పే పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. ఓ వ్యాపారవేత్త అధిక కమీషన్లు ఇవ్వలేదని రాష్ట్రం విడిచి వెళ్లాలని ఓ ప్రముఖ నేత బెదిరించాడన్నారు. హిందూ కార్యకర్తలను, స్వామీజీలను బెదిరిస్తున్నారన్నారు. 2028 తరువాత ఏమవుతుందో సీఎంకు తత్వం బోధపడిందన్నారు. స్థానిక ఎన్నికలపై జేడీఎస్ పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని విజయేంద్ర తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
చాముండి సన్నిధిలో
మంచు మనోజ్
మైసూరు: ప్రముఖ తెలుగు సినీనటుడు మంచు మనోజ్ బుధవారం కుటుంబ సమేతంగా మైసూరులోని చాముండికొండపై కొలువైన చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు చేసి అర్చకులతో ఆశీర్వాదం పొందారు. ఆయనకు దేవస్థానం తరఫున ప్రసాదాన్ని అందించి సత్కరించారు. స్థానిక ప్రముఖులు జీ.శ్రీనాథ్‌బాబు, జీ.రాఘవేంద్ర, కిరణ్, హరీష్ నాయుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు.


