సాక్షి, బెంగళూరు: చాలా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న రాష్ట్ర జడ్పీ, టీపీ ఎన్నికలు సమీపిస్తున్నట్లే ఉంది. ఆ ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 239 తాలూకా పంచాయతీలలో 3,656 అధ్యక్ష, సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజెట్‌ను విడుదల చేసింది. సగం కంటే ఎక్కువగా సుమారు 1,905 స్థానాలను మహిళలకు కేటాయించింది. దీంతో పెండింగ్‌లో ఉన్న ఎన్నికలకు మార్గం సుగమం అయింది. గతంలో ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది.
నేడు ప్రాథమిక నోటిఫికేషన్
శివాజీనగర: ఎన్నికల ప్రాథమిక నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి న్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల నోటిఫికేషన్ ప్రచురణ తరువాత ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత తుది జాబితాను ప్రకటిస్తామని, ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటిస్తుందని తెలిపారు. చాలా ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో గాంధీజీ కలలుగన్న స్థానిక స్వపరిపాలన అటకెక్కింది.
239 తాలూకాల
రిజర్వేషన్ల ఖరారు
తాలూకా పంచాయతీల రిజర్వేషన్లు ..
ఎస్సీ – 733 స్థానాలు (మహిళలకు 429)
ఎస్టీ – 394 స్థానాలు (మహిళలకు 287)
బీసీ అ– కేటగిరీ – 508 స్థానాలు (మహిళలకు 306)
బీసీ బ– కేటగిరీ – 111 స్థానాలు (మహిళలకు 64)
జనరల్ – 1,910 స్థానాలు (మహిళలకు 819)
జడ్పీలలో 1,129 స్థానాలు
అలాగే 31 జిల్లా పంచాతీయల్లో మొత్తం 1,129 స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించగా మహిళలకే సింహభాగం దక్కింది. బెళగావి జిల్లా పంచాయతీ అత్యధికంగా 90 స్థానాలు, గదగ్ జడ్పీ అతి తక్కువగా 25 స్థానాలు కలిగి ఉన్నాయి.
జడ్పీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు
ఎస్సీ – మొత్తం 225 స్థానాలు (121 సీట్లు మహిళలకు)
ఎస్టీ – మొత్తం 102 (59 మహిళలకు)
బీసీ అ కేటగిరీ – 183 స్థానాలు (98 మహిళలకు)
బీసీ బ కేటగిరీ – 43 స్థానాలు (25 మహిళలకు)
జనరల్ కేటగిరీ – మొత్తం 576 స్థానాలు
(268 స్థానాలు మహిళలకు)


