పంటలు ఎండి.. అప్పులు దండి.. | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండి.. అప్పులు దండి..

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

సాక్షి,బళ్లారి: ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులు పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కరువు కోరల్లో చిక్కుకుని రైతులు విలవిల్లాడుతున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి కరువు పీడిత ప్రాంతాలను పరిశీలించారు. ఆయన బుధవారం జిల్లాలోని హలకుంది గ్రామంలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. గ్రామంలోని కంది పంట, సజ్జ పంటలను వీక్షించి చలించిపోయారు. విత్తనాలు భూమిలో వేసినప్పటి నుంచి సరైన వర్షాలు రాకపోవడంతో విత్తనాలు మొలిచిన తర్వాత నేలలో ఉండిపోయిన మొక్కలను చూసి రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతు పొలం చూసినా ఎండిన జొన్న, పెరగని కంది పంటను చూసి రైతులకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని గమనించారు. పలువురు రైతులు డీసీఎంతో తమ గోడును వినిపించారు. పంట చేతికందే పరిస్థితి లేదని, అప్పులు కట్టడానికి చేతకావడం లేదన్నారు. ఒక ఎకరానికి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా చేతికి చిల్లిగవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. కరువు కష్టాల నుంచి తమను గట్టెక్కించాలన్నారు.

రైతులు అధైర్యపడొద్దు, అండగా ఉంటాం

అనంతరం డీసీఎం పరమేశ్వర్‌ రైతులతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మహత్యలు చేసుకోకూడదని, ప్రతి రైతు కన్నీరు తుడుస్తామన్నారు. రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రైతులకు రుణాల వసూలు వాయిదా వేయిస్తామన్నారు. కరువు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని, కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా రూ.2500 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కరువు కారణంగా రాష్ట్రంలో రూ.46 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. రూ.11 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇప్పటికే కేంద్ర కరువు అధ్యయన బృందం రాష్ట్రంలో పర్యటించిందని గుర్తు చేశారు. కేంద్రం నుంచి త్వరలో పరిహారం అందుతుందనే విశ్వాసం ఉందన్నారు. వెంటనే రైతులను ఆదుకునే ప్రక్రియ మొదలు పెడుతామన్నారు. మంత్రి వెంట జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌, జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మంత్రులపై ప్రతిపక్షాలు స్టింగ్‌ ఆపరేషన్‌ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయంటూ సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని డీసీఎం పరమేశ్వర్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం జిల్లాలో కరువు ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చిన నేపథ్యంలో హలకుంది గ్రామం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంపై సీఎంకు ఇంటెలిజెన్స్‌ శాఖ నుంచి సమాచారం అంది ఉంటుందన్నారు. గ్యారెంటీ పథకాల వల్ల ఆర్థిక భారం ఉన్న మాట వాస్తవమేనని, అయితే వాటిని కచ్చితంగా కొనసాగిస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పేదల కన్నీరు తుడవడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పాల ధర పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని రైతులకే అందిస్తామన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ రాష్ట్రం కన్నా పాల ధర ఎక్కువగా ఉందన్నారు. జిందాల్‌ కంపెనీ భూకబ్జా ఆరోపణలపై అధికారులతో చర్చించి వాస్తవాల పరిశీలన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

విజయనగర జిల్లాలో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తున్న డీసీఎం పరమేశ్వర్‌

హలకుంది వద్ద ఎండిన సజ్జ పంటను పరిశీలిస్తున్న డీసీఎం పరమేశ్వర్‌

డీసీఎం ఎదుట రైతులు కన్నీరు

కరువు ప్రాంతాలను పరిశీలించిన

ఉప ముఖ్యమంత్రి

సజ్జ, కంది పంటలను వీక్షించిన పరమేశ్వర్‌

ఎండిన పంటలను చూసి

చలించిపోయిన వైనం

పంట ఎండింది, పరిహారం ఇప్పించండని వినతి

పోతలకట్టెలో పంటలను పరిశీలించిన డీసీఎం

హొసపేటె: విజయనగర జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌ పరిశీలించారు. హొసపేటె తాలూకాలోని పోతలకట్టె గ్రామంలో పర్యటించిన ఆయన రైతుల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు చింతపల్లి తాయప్ప పొలంలో సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను డీసీఎం పరిశీలించి, కరువు ప్రభావం, పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పంటలకు నీటి లభ్యత, దిగుబడిపై కరువు ప్రభావం తదితర అంశాలపై అధికారులతో చర్చించిన డీసీఎం రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టానన్నారు. మంత్రి బసవంతప్ప, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.టీ.శ్రీనివాస్‌, విజయనగర జిల్లా డీసీ కవిత మన్నికేరి, సీఈఓ గరీమా పన్వర్‌, ఎస్పీ జాహ్నవి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ డీడీలు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement