రాయచూరు రూరల్: రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు బీజేపీ, జేడీఎస్ పొత్తుతోనే జరుగుతాయని విధాన పరిషత్ సభ్యుడు రవి కుమార్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్‌లో 25 ఏళ్ల మోదీ పాలనపై ఏర్పాటు చేసిన సేవా జ్యోతిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల పాటు మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. పాలకుల మధ్య సమన్వయం లేదన్నారు. మరో వైపు శాంతి భద్రతలు కూడా క్షీణించాయని అన్నారు. కరువు సహాయక పనులు, పరిహారం చెల్లింపు విషయంలో అశ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. బీజేపీ, జేడీఎస్ మైత్రి మరింత బలపడుతుందన్నారు. మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, వజ్జల్ మానప్ప, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ బి.వి.నాయక్, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్‌లున్నారు.
మూడు ట్రక్కుల వరుస ఢీ...
● ముగ్గురికి తీవ్ర గాయాలు
హొసపేటె: కూడ్లిగి తాలూకాలో బుధవారం మూడు ట్రక్కులు వరుసగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. టైరు పగిలిపోతుందనే భయంతో ఓ ట్రక్కు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న రెండు ట్రక్కులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ధాటికి మూడు ట్రక్కుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో డ్రైవర్లు వాహనాల్లోనే చిక్కుకుపోవడంతో స్థానికులు, టోల్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం దావణగెరె ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కూడ్లిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పిడుగుపాటుకు పశువుల మృతి
హుబ్లీ: భారీ వర్షాలతో పాటు పిడుగు పాటుకు రెండు పశువులు మృతి చెందిన ఘటన అళ్నావర తాలూకా డోరి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన సంజు అనే వ్యక్తి ఇంటి వెనుక పెరట్లో కట్టివేసిన పశువులపై పిడుగు పడడంతో రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. కొబ్బరి చెట్టుపై పడ్డ పిడుగు పశువులను మంటలతో ఆహుతి చేసింది. వీటి సమీపంలో ఉన్న గేదె దూడ కూడా గాయపడింది. ఇప్పటికే ఎండల తీవ్రతతో అల్లాడి పోడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆశ పడిన రైతన్నలకు చెరుకు, వరి పంటలు నేల పాలయ్యాయి. ఘటన స్థలాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించి ప్రభుత్వ నియమాల ప్రకారం తగిన పరిహారం అందజేస్తామన్నారు. గుడిగేరిలో కూడా పిడుగు పాటుకు టెంకాయి చెట్టు మంటలకు ఆహుతి అయింది. ఆ గ్రామానికి చెందిన నాగనగౌడ పెరట్లోని టెంకాయి చెట్టుపై నిప్పు రాజుకొని 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయి. అయితే ఆ వెంటనే వర్షం రావడంతో మంటలు ఆరిపోయానని రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రోడ్డు పనుల్లో అలసత్వం వద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో జాతీయ రహదారి పనుల్లో అధికారులు అలసత్వం వీడాలని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో జాతీయ రహదారి పనులపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ మాల పథకంలో బెళగావి–హునగుంద–రాయచూరు పనుల్లో నాణ్యత కొరవడిందన్నారు. పనులు నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదారి నిర్మాణ విషయంలో లోపాలను సవరించాలని, అశాసీ్త్రయంగా రహదారి నిర్మాణం చేపట్టడం తగదన్నారు.
గంజాయి పట్టివేత
హోసూరు: ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న ఒడిశా వాసిని సిఫ్‌కాట్ ఫోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు జూజువాడి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి సిఫ్‌కాట్ పోలీసులు తమిళనాడు ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేశారు. నిందితుడు అంగార బెహరా (28) వద్ద 2.50 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి తిరుప్పూర్‌లో అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. గంజాయిని సీజ్ చేసి అతనిని అరెస్టు చేశారు.


