సాక్షి,బళ్లారి: 2001 అక్టోబర్ 7న ప్రజాజీవితంలోకి అడుగు పెట్టిన మోదీ 25 ఏళ్లుగా ఓటమి ఎరగని నేతగా, దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, దేశ సేవకుడుగా, దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహోన్నత నాయకుడు మోదీ అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం మోదీ పాతికేళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సేవా జ్యోతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా బళ్లారిలోని గాంధీభవన్‌లో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. దేశ ప్రజలు పాతికేళ్లుగా మోదీపై చూపుతున్న ఆదరణ, విశ్వాసం ఎన్నటికీ మరవలేమన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి పెద్ద పీట వేశారని కొనియాడారు. రాజ్యాంగ విలువలను మార్గదర్శనంగా చేసుకుని అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు మరింత కృషి చేస్తూ వికసిత భారత్ నిర్మాణం కోసం శ్రమిస్తున్నారన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళుతున్నారన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగర వీధులలో మోదీ సేవా జ్యోతికి సంబంధించిన ర్యాలీని చేపట్టారు.
బీజేపీ సేవా జ్యోతి ర్యాలీ
హొసపేటె: విజయనగర జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. హొసపేటెలోని బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సాగింది. యాత్రలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుష్పాలతో అలంకరించిన వాహనంలో ఎమ్మెల్యే కృష్ణ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్‌రెడ్డి, సందీప్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పునీత్‌రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద డాక్టర్ సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. సేవా భావం, దేశాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
చరిత్ర పుటల్లో చిరస్థాయిగా
పాతికేళ్ల మోదీ ప్రజాజీవితం
ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన
పార్టీ నాయకులు, కార్యకర్తలు
గాంధీభవన్‌లో వేడుకగా
బీజేపీ సేవా జ్యోతి కార్యక్రమం


