క్షీర ధర మథనం | - | Sakshi
Sakshi News home page

క్షీర ధర మథనం

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ నందిని బ్రాండు పాల ధర భగ్గుమననుంది. లీటర్‌కు రూ.8 మేర పెంపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిషత్‌ ఎన్నికల వల్ల కోడ్‌ అమల్లో ఉండడంతో ధరల పెంపునకు ఎన్నికల సంఘం అనుమతి కోరనుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధ్యక్షతన మంగళవారం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం జరిగింది. గత కొన్నివారాలుగా చర్చలో ఉన్న పాల ధర పెంపును ఆమోదించారు. ఈసీ అనుమతి లభిస్తే నవంబర్‌ 1 నుంచి ప్రజలపై ఈ బాదుడు పడబోతుంది. పాల సేకరణ ధరను పెంచాలని డెయిరీలు, పాల రైతులు ఇటీవల సీఎంను కలవడం తెలిసిందే.

ఆపద మిత్రలకు సహాయక కిట్లు

యువ ఆపప మిత్ర యోజన కింద ఎంపికయిన స్వయం సేవకులకు రక్షణ సామగ్రిని అందిస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో వారు సహాయక చర్యల్లో పాల్గొంటారు. మొత్తం 10,350 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. తలా రూ. 10 వేలతో రక్షణ ఉపకరణాల కిట్లను ఇస్తారు.

ఆ జిల్లాల మహిళలకు సాయం

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బెళగావి, కలబురిగిలో మహిళా లబ్ధిదారులకు 25 శాతం సబ్సిడీతో ఆవుల కొనుగోలుకు సహాయం చేయనున్నారు. రూ.18 వేల దాకా సాయం లభిస్తుంది.

ఆ భూములు వెనక్కి

● కేఐఏడీబీ సువర్ణ కర్ణాటక అభివృద్ధి కారిడార్‌ కోసం శివమొగ్గ జిల్లా సిద్ధిపుర, దేవకాతికొప్ప గ్రామాల్లోని స్వాధీనం చేసుకున్న 362 ఎకరాల స్థలాన్ని సొంతదారులకు వెనక్కి ఇవ్వాలని తీర్మానం.

● కేఐఏడీబీ ఆధ్వర్యంలో హారోహళ్లి మూడో లేఔట్‌ పారిశ్రామిక ప్రాంతం కోసం భూస్వాధీనం చేసుకున్న కొంత భూమిని యజమానులకు తిరిగి ఇస్తారు.

● రేషన్‌ స్టోర్ల కోసం ఈ–పాస్‌, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, ఐరిస్‌ స్కానర్లను ఏటా రూ. 44.37 కోట్లతో అద్దెకు తీసుకునేందుకు ఆమోదం.

నందిని పాల రేటు రూ. 8 పెంపు!

మంత్రిమండలి భేటీలో నిర్ణయం

బెంగళూరులో 5 పోలీసు కమిషనరేట్లు

వచ్చే జనవరిలో పంచాయతీల ఎన్నికలు

ఆర్టీసీకి 800 కొత్త బస్సులు

రూ.304 కోట్లతో కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థకు 400 మఫిసిల్‌ బస్సులు, వాయువ్య కర్ణాటకకు 200 మఫిసిల్‌ బస్సులు, బీఎంటీసీకి 200 సిటీ బస్సులు.. మొత్తంగా 800 కొత్త బీఎస్‌–6 బస్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపారు.

పాల బడ్జెట్‌ పెరగనుంది

5 కమిషనరేట్లుగా రాజధాని

శాంతిభద్రతలు, పరిపాలన సౌలభ్యానికి బెంగళూరు నగర పోలీసు కమిషనరేట్‌ను మొత్తంగా 5 కమిషనరేట్లుగా విభజించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తూర్పు, పశ్చిమం, ఉత్తర, దక్షిణం, సెంట్రల్‌ పేరిట ఈ కమిషనరేట్లు మనుగడలోకి వస్తాయి. కర్ణాటక న్యాయాంగ డిజిటలీకరణ పథకానికి రూ. 704 కోట్ల ఖర్చుతో అంగీకరించారు.

జనవరిలో స్థానిక సమరం?

కేబినెట్‌ భేటీలో జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగింది. రిజర్వేషన్లకు అనుమతిస్తే జనవరి మొదటి వారంలో నిర్వహించాలని చర్చించారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్లపై అనుమతికి ప్రభుత్వం మనవి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement