చెరువులో ముగ్గురు బాలల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

చెరువులో ముగ్గురు బాలల మృత్యువాత

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

యశవంతపుర: చెరువులోకి ఈతకెళ్లిన ముగ్గురు బాలలు నీటమునిగి కుటుంబాలకు తీరని శోకం కలిగించారు. చిక్కమగళూరు తాలూకా మర్లే గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా... తరుణ్‌ (12), భువన్‌ (12), లిఖిత్‌ (12) అనే బాలలు 6వ తరగతి చదువుతున్నారు. మంగళవారం సెలవు ఉండడంతో ఉదయం 11 గంటలకు దగ్గరలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. బాలలు మునిగిపోతూ కేకలు వేసినా ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు పోయాయి. ఈ ఘోరం తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు అక్కడికి పరుగు పరుగున వచ్చారు. ఫైర్‌ సిబ్బంది గాలించి శవాలను బయటకు తెస్తుండగా చూసిన కన్నవారు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఏటీఎం కార్డు పేరుతో రూ.2.74 లక్షల టోకరా

శివమొగ్గ: శివమొగ్గలో సైబర్‌ మోసగాళ్లు ఒక వ్యక్తికి కాల్‌ చేసి భారీగా డబ్బులు కొట్టేశారు. బాధితుడు దొడ్డప్ప రామచంద్రకు ఫోన్‌ చేసిన మోసగాడు తాను ఫలానా బ్యాంకు మేనేజర్‌నని, మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని, దానిని పునరుద్ధరించుకోవాలని చెప్పాడు. అందుకోసం, మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను చెప్పమని కోరాడు. ఇది నిజమని నమ్మిన రామచంద్ర, వచ్చిన ఓటీపీ నంబర్‌లను చెప్పాడు, ఇలా కొన్నిసార్లు ఓటీపీలు తీసుకున్నారు. కేటుగాడు మీ ఏటీఎం కార్డు ఓకే అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ తర్వాత, తన మొబైల్‌లో సందేశాలను చూసుకుని షాక్‌ అయ్యాడు. అతని ఖాతా నుంచి రూ.2.74 లక్షలు పోయాయి. శివమొగ్గలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సముద్రంలో బాలుని గల్లంతు

యశవంతపుర: స్నేహితులతో కలిసి బీచ్‌కెళ్లి సముద్రంపాలైన ఘటన మంగళూరు తీరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బెళ్తంగడి తాలూకాకు చెందిన సేనప్ప కుమారుడు శ్రేయస్‌ (14) ఐదుమంది స్నేహితులతో కలిసి పణంబూరు బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి దిగి అటలాడుతుండగా పెద్ద అల రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. తీరంలో ఉంటున్న గజ ఈతగాళ్లు గాలించినా జాడ దొరకలేదు. మంగళవారం సాయంత్రం వరకు గాలించి నిలిపివేశారు. తమ కొడుకు కోసం కన్నవారు అక్కడే విలపిస్తూ ఉన్నారు.

మెరిసిన కోలారు అందం

కోలారు: ఢిల్లీలో జరిగిన ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా– మిస్‌ టీన్‌ ఇండియా–2026 అందాల పోటీల్లో కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా హోసహుడ్య గ్రామానికి చెందిన తేజశ్రీ విజేతగా నిలిచింది. రాబోయే సంవత్సరం ఇండోనేషియాలో జరిగే మిస్‌ ప్రీ టీన్‌ ఇండిపెండెంట్‌ ఇంటర్‌నేషనల్‌ పోటీల్లో పాల్గొనడానికి ఎంపికై ంది. రైతు హరినాథ్‌, రూప దంపతుల కుమార్తె తేజశ్రీ చదువుకుంటూనే అందాల పోటీల్లో పాల్గొంటూ రాణిస్తోంది. ఇటీవల శివమొగ్గలో జరిగిన మిస్‌ టీన్‌ కర్ణాటక పోటీల్లో విజేతగా నిలిచి జాతీయ పోటీల్లో పాల్గొంది.

అర్ధరాత్రి మంత్రి తనిఖీలు

దొడ్డబళ్లాపురం: ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్‌ సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో రామనగర జిల్లా చెన్నపట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రి మొత్తం తిరిగి పరిశీలించారు. సిబ్బంది, వైద్యుల హాజరు పుస్తకం పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందులు ఇవ్వడం లేదని, బయట తీసుకోవాలని చీటి రాసిస్తున్నారని రోగులు చెప్పడంతో మంత్రి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల స్టాకుపై వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement