సాక్షి బెంగళూరు: కోట్లాది రూపాయల కేపీఎస్‌సీలో పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంలో ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈసారి మరో సభ్యురాలు వలలో చిక్కింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా ఉన్న కేపీఎస్‌సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప, ఆ సంస్థ మరో సభ్యురాలు బీవీ గీతా ఇళ్లలో మంగళవారం సోదాలు జరిపారు.
తనిఖీల తరువాత నిర్బంధం
బెంగళూరు సంజయనగర డాలర్స్ కాలనీలో ఉన్న శివశంకరప్ప సాహుకార్ ఫ్లాటులో భారీ భద్రత మధ్య సోదాలను చేపట్టారు. గతంలో కూడా ఆయన ఇంటిలో ఈడీ తనిఖీలు చేసింది. పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, పెట్టుబడులపై కొన్ని గంటల పాటు శివశంకరప్పను విచారించారు. అలాగే గీతా ఇంట్లోనూ గాలింపు కొనసాగింది. అరెస్టయిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ ఇచ్చిన సమాచారమే దాడులకు కారణమని తెలుస్తోంది. పశు వైద్యాధికారులతో పాటు పలు ఉద్యోగాల భర్తీలో వీరు లక్షలాది రూపాయలు తీసుకుని పోస్టులను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. సోదాల తరువాత శివశంకరప్ప, గీతాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు మరింత దూరం వెళ్లినట్లు స్పష్టమైంది.
శాంత ముందస్తు బెయిలుకు నో
మరో నిందితురాలు, సభ్యురాలు డాక్టర్ శాంత హొసమని ముందస్తు బెయిలు అర్జీని హైకోర్టు తిరస్కరించింది. ఇలాంటి దశలో మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని జడ్జి జస్టిస్ ఎస్.విశ్వజిత్ శెట్టి స్పష్టం చేశారు. కేపీఎస్‌సీ కేసులో శాంతా ఏ2 నిందితురాలిగా ఉన్నారు. తనకు కావలసిన అభ్యర్థులకు ఉదారంగా మార్కులను ఇచ్చారనే ఆరోపణలున్నాయి. సదరు నిందితురాలు అన్ని ఆరోపణల్లో సంబంధం కలిగి ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
శివశంకరప్ప సహా బీవీ గీత ఇళ్లలో సోదాలు
ఇద్దరి నిర్బంధం


