● రాష్ట్రంలో గతేడాది 1,882 కేసులు
● దేశంలోనే మూడో స్థానం
● కిద్వాయి వైద్యసంస్థ హెచ్చరిక
అందమైన బాల్యం క్యాన్సర్ కోరల్లో నలిగిపోతోంది. వైద్యరంగం ఎంత పురోగతి సాధించినా.. క్యాన్సర్ అనే పేరు వినగానే భయపడాల్సిందే. అంత తీవ్రంగా ఈ మహమ్మారి సమాజంలో దిగులు పుట్టిస్తోంది.
సాక్షి, బెంగళూరు: అధిక మద్యం, మాంసం, ధూమపానం, కాలుష్యానికి గురికావడం, వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్ ఏర్పడుతుందని వైద్యనిపుణులు చెబుతారు. కానీ వీటిలో చాలావాటితో సంబంధం లేని చిన్నపిల్లలకు సైతం క్యాన్సర్ ముప్పు విస్తరించింది. భారతదేశంలో ఏటా 35 వేల మందికి పైగా పిల్లల్లో క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తున్నారు. కర్ణాటకలో 2025లో 1,882 బాలల్లో క్యాన్సర్ రికార్డయింది. పిల్లల్లో క్యాన్సర్ కేసుల్లో దేశంలోనే మూడో స్థానంలో నిలవడం తీవ్రతను సూచిస్తోంది.
2.5 శాతం మంది బాలలే
భారతదేశంలో బాల్య క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా మారుతున్నాయి. మనదేశంలో ఏటా సుమారు 35 వేల మందికిపైగా బాలలకు ఈ జబ్బు సోకితే వారిలో సుమారు 16,850 మందిని బలిగొంటోంది. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 2.5 శాతం మంది బాలలే ఉంటున్నారని బెంగళూరులోని కిద్వాయి క్యాన్సర్ వైద్య సంస్థ గణాంకాలను విడుదల చేసింది.
లుకేమియా అధికం
పిల్లల్లో లుకేమియా అనే రక్త క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని కిద్వాయి సంస్థ ప్రకటించింది. బాలురలో 40.3 శాతం, బాలికల్లో 34.3 శాతం లుకేమియా కేసులే కావడం గమనార్హం. అలాగే మెదడు, నరాల ట్యూమర్లు కూడా పిల్లల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.
మొదట్లోనే గుర్తిస్తే
చికిత్స సులభం
పిల్లల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించి ఎంతో ముఖ్యమని కిద్వాయి వైద్యనిపుణులు తెలిపారు. దేహంలో గడ్డలు, తరచుగా జ్వరం వస్తుంటే అలక్ష్యం చేయొద్దని హెచ్చరించారు.
చర్మం తెలుపు రంగులోకి మారడం, రక్తం పడడం, తలనొప్పి, వాంతులు, బరువు తగ్గడం, నీరసం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కళ్లల్లో తెల్లని మచ్చ కనిపించినా జాగ్రత్త పడాలి.
మొదట్లోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే నయం చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
2025లో 1,882 కేసులు
కర్ణాటకలో 2025లో 1,882 మంది బాలల్లో క్యాన్సర్ కనిపిస్తే అందులో 312 మరణాలు సంభవించాయి. బెంగళూరులో 349 మంది పిల్లలు క్యాన్సర్‌తో పోరాడుతుంటే, 56 మంది చనిపోయారు. 2024లో కిద్వాయి ఆస్పత్రిలో 0–19 ఏళ్ల బాలల్లో 588 క్యాన్సర్ కేసులను గుర్తించారు. పిల్లల కోసం ఆస్పత్రిలో 65 పడకలు కలిగిన వార్డు, 16 పడకలు కలిగిన పీఐసీయూ ఉన్నాయి.


