అపురూపం.. వజ్ర సింహాసనం | - | Sakshi
Sakshi News home page

అపురూపం.. వజ్ర సింహాసనం

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

మైసూరు: ప్రఖ్యాత మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాలకు అంబా విలాస్‌ ప్యాలెస్‌లో సన్నాహాలు ఊపందుకున్నాయి. సోమవారం రాజకుటుంబం ప్రైవేట్‌ దర్బార్‌ కోసం రత్నఖచిత సింహాసనం కూర్పు నిర్వహించారు. రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్‌ సమక్షంలో వేదపండితులు ఉదయం నుంచి గణపతి హోమం, నవగ్రహ హోమం, చాముండి పూజ, శాంతి హోమం, శుద్ధి నిర్వహించారు. రాజ ఏనుగు, రాజ గోవు, రాజ అశ్వాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఉదయం 10:20 గంటల శుభ ముహూర్తంలో, దర్బార్‌ హాల్‌లోని బంగారు వజ్ర సింహాసనం 13 భాగాలను ఒక్కటిగా కూర్చారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి కాగా, తెరను అడ్డుగా పరిచారు. ఈ సమయంలో ప్యాలెస్‌లోకి పర్యాటకులను అనుమతించలేదు. ఈ సింహాసనాన్ని నవరాత్రుల సమయంలో మాత్రమే చూడవచ్చు. నవరాత్రులలో మహారాజు ఈ సింహాసనంపై కూర్చుని దర్బార్‌ను నడపడం ఆనవాయితీ. తరువాత రాజభవనం నేల మాళిగలో ఒక రహస్య గదిలో భద్రపరుస్తారు.

అభిమన్యుకు రాజ స్వాగతం

● సంబరంగా పునరాగమనం

దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు విశిష్ట అతిథిగా కెప్టెన్‌ అభిమన్యు గజరాజు విచ్చేసింది. సోమవారం మైసూరు అంబావిలాస్‌ ప్యాలెస్‌లోకి ఘన స్వాగతం లభించింది. పెద్ద కిరీటం తొడిగి రాచమర్యాదలతో సత్కరించారు. గత కొన్నేళ్లుగా జంబూ సవారీలో అమ్మవారి అంబారీ మోస్తున్న అభిమన్యుకు ఈ ఏడాది రిటైర్మెంటు ఇవ్వడం తెలిసిందే. అయితే ప్రజల డిమాండ్‌ మేరకు గజదళంలోకి తిరిగి తీసుకున్నారు. మత్తిగోడు శిబిరం నుంచి లారీలో ప్యాలెస్‌ జయమార్తాండ గేటు వద్దకు చేరుకున్న అభిమన్యుకు ప్యాలెస్‌, అటవీ, పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలదండలు వేశారు. రూప, చైత్ర, ప్రశాంత్‌, గోపి అనే 4 ఏనుగులు పాల్గొన్నాయి. గంధదగుడి ఫౌండేషన్‌, అభిమన్యు అభిమాన సంఘం వారు గజరాజుకు 10 కిలోల బరువున్న అద్భుతమైన మైసూరు పేటాను తొడిగారు. అభిమన్యు రాజదర్పంతో గజదళం బసచేసిన షెడ్డకు చేరుకుంది. అభిమన్యు అలవాటు పడటానికి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారని డీసీఎఫ్‌ ప్రభుగౌడ తెలిపారు. ఎమ్మెల్యే టి.ఎస్‌.శ్రీవత్స పాల్గొన్నారు.

సింహాసనం పనుల్లో సిబ్బంది

అభిమన్యుకు స్వాగతోత్సవం

ప్యాలెస్‌లో శాస్త్రోక్తంగా జోడింపు

దసరాకు పర్వదినాలకు ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement