రైతుల సంక్షేమం పట్టదా? | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమం పట్టదా?

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

తుమకూరు: కరువు తీవ్రంగా ఉంది, తక్షణమే రైతులకు ఉచిత పశుగ్రాసం అందజేయాలి, రోజూ కనీసం 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి. జాతీయ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి అని రైతుసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రైతు సంఘం, రైతు శక్తి, తిపటూరు తాలూకా హల్లికర్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. రైతు నేతలు ఎన్‌.పద్మనాభ, ఈశ్వర్‌ మాట్లాడుతూ, ఈసారి జిల్లాలో వర్షాలు లేక తీవ్ర కరువు నెలకొందని, రైతులు విత్తనాలు వేయలేదని, వేసిన కొద్దిపాటి పంట కూడా నాశనమైందని అన్నారు. రైతులకు వెన్నెముక అయిన పశువులకు మేత దొరకడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయాల్సిన ప్రభుత్వం, రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ. 25 వేలు పరిహారంగా ఇవ్వాలని పలు డిమాండ్లను వినిపించారు.

రైతును బలిగొన్న అప్పులు

మైసూరు: జిల్లాలోని పిరియపట్న తాలూకా కనగాలు గ్రామంలో సుందరేశ్‌ (40) అనే రైతు ప్రాణాలు తీసుకున్నాడు. సుందరేశ్‌కు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. అందులో అతను పొగాకు, జొన్న, అల్లం పంటలు పండించేవాడు. ఇందుకోసం అతను కర్ణాటక గ్రామీణ బ్యాంకు నుంచి రూ. 9 లక్షలు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ. 16.40 లక్షల వరకూ అప్పులు తీసుకున్నాడు. అయితే కరువు, పంట నష్టం వల్ల కష్టాల్లో పడిపోయాడు. తీవ్ర ఆవేదన చెందిన సుందరేశ్‌, తన కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య గౌరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టదపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

పార్టీలో జిమ్‌ ట్రైనర్‌ హత్య

దొడ్డబళ్లాపురం: విందు వికటించి జిమ్‌ ట్రైనర్‌ను దుండగులు హత్య చేసిన సంఘటన బెంగళూరు హెబ్బాళ సమీపంలోని కెంపాపురలో జరిగింది. హతుడు నందన్‌ (25). వివరాలు.. సహకారనగరలో ఉన్న మ్యాసివ్‌ జిమ్‌లో నందన్‌ శిక్షకునిగా పని చేస్తున్నాడు. అనుష్‌ అనే వ్యక్తికి సొంతంగా శిక్షణనిచ్చేవాడు. ఆదివారంనాడు జిమ్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అనుష్‌ తన అపార్ట్‌మెంట్‌లో విందు ఇచ్చాడు. నందన్‌తో పాటు జిమ్‌ సహోద్యోగులు శరత్‌, నిశాంత్‌, విశ్వ వచ్చారు. మద్యం తాగాక ఈ ముగ్గురూ నందన్‌తో మాట్లాడుతుండగా వాగ్వాదం జరిగింది. తీవ్రరూపం దాల్చి ముగ్గురూ కొట్టడంతో నందన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కొందరు అతన్ని హెబ్బాళలోని ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి పై ముగ్గురిని అరెస్టు చేశారు.

క్రీడాకారులకు సరైన

నజరానా: డీసీఎం

శివాజీనగర: ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో క్రీడాకారులకు ఇచ్చే బహుమతి సొమ్మును సమీక్షిస్తున్నాం, ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చించారు అని డీసీఎం జీ.పరమేశ్వర్‌ చెప్పారు. ఏషియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే బహుమతి డబ్బును మంగళవారం ప్రకటిస్తామని తెలిపారు. స్వర్ణ పతక విజేత పూవమ్మతో పాటు ఇతర క్రీడాకారులతో మాట్లాడానని చెప్పారు.

స్టీల్‌ ఫ్యాక్టరీ అధికారి ఆత్మహత్య

శివమొగ్గ: జిల్లాలోని భద్రావతి విశ్వేశ్వరయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ (విఐఎస్‌ఎల్‌)లో డీజీఎంగా పనిచేస్తున్న గోవిందరాజు (54) ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజు గత 8 ఏళ్లుగా విఐఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీలో డీజీఎంగా ఉంటూ, క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన స్వస్థలం తమిళనాడులోని సేలం జిల్లా, ఆయన కుటుంబం సేలంలోనే నివసిస్తోంది. గోవిందరాజు భార్య రెండు రోజుల క్రితమే భద్రావతికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యను రైలులో సొంతూళ్లో వదిలి ఆయన తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం పేపర్‌ బాయ్‌ వెళ్లినప్పుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఫ్యాక్టరీ అధికారులు, స్థానిక పోలీసులు ఇంటికి చేరుకుని పరిశీలించారు, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కుటుంబానికి సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement