యశవంతపుర: బెంగళూరులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు–మెరుపులతో పడిన వానలతో జనం కకావికలమయ్యారు. కూడళ్లలో నీరు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి. మెజెస్టిక్ ఆనందరావ్ సర్కిల్, కేఆర్ పుర, టిన్ ఫ్యాక్టరీ, టిసి పాళ్య, జక్కూరు, హెబ్బాళ చుట్టుపక్కల వర్షం కురిసింది. దట్టంగా మేఘావృతమై చీకట్లు ఆవరించడతో పట్టపగలే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని తిరిగారు. గెద్దలహళ్లి రైల్వే వంతెన కింద నీళ్లు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. హెణ్ణూరు వైపు సంచారం నెమ్మదిగా సాగింది. శేషాద్రిపురంతో పాటు అనేక బ్రిడ్జిల కింద వాననీళ్లు నిలిచి అంతరాయం ఏర్పడింది. వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చని బెంగళూరు వాతావరణశాఖ తెలిపింది. వర్షంతో నగర వాతావరణం చల్లగా మారింది.
పలు కూడళ్లు జలమయం
పట్టపగలే చీకట్లు


