మరింత బిగిసిన కేపీఎస్‌సీ స్కాం | - | Sakshi
Sakshi News home page

మరింత బిగిసిన కేపీఎస్‌సీ స్కాం

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

బనశంకరి: కర్ణాటక లోకసేవా కమిషన్‌ (కేపీఎస్‌సీ)లో 400కు పైగా పశువైద్యాధికారుల ఉద్యోగ కుంభకోణంలో కటకటాల్లో ఉన్న ప్రముఖ నిందితులు ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ గంగ్వార్‌, దళారీ బసవరాజ్‌ కన్నాళే మరింత చిక్కుల్లో పడిపోయారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఈడీ అధికారులు వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. గత నెలాఖరులో వీరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసి విచారించి, పరప్పనలో ఉంచడం తెలిసిందే.

చకచకా పరిణామాలు ఇలా

కేపీఎస్‌సీ స్కాంలో ఈడీ అధికారులు నెలరోజుల కిందట సోదాలు నిర్వహించారు. కారాగారంలో ఉన్న ఇద్దరినీ ఈడీ అధికారులు గత 3 రోజుల నుంచి ప్రశ్నించారు. కానీ నోరు మెదపకపోవడంతో వారు ఆగ్రహించారు. శుక్రవారం రాత్రి జైలులోనే అరెస్ట్‌చేసి శాంతినగరలోని ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచి తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ స్కాంలో లోతుగా విచారణ చేపట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ఐఏఎస్‌, దళారీ లింకులు

ఐఏఎస్‌ జ్ఞానేంద్ర గత నెలలో స్కాం బయటపడగానే ఢిల్లీకి పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా తిరగడానికి విమానాలకు రూ.11 లక్షలు ఖర్చు చేశాడు. 2024లో కేపీఎస్‌సీలో పరీక్షల కంట్రోలర్‌గా ఉన్న జ్ఞానేంద్రకుమార్‌కు పాత స్నేహితుడైన బసవరాజ కన్నాళే జత కలిశాడు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు ప్లాన్‌ చేశారు. పశువైద్యాధికారుల నియామకంతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీలోనూ ఒప్పందం కుదుర్చుకుని, పశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగాల విక్రయం సాగించి కోట్లాది రూపాయలను వెనకేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. నగదు గురించి సీఐడీ ఆధారాలను సేకరించింది.

కొరడా విదిల్చిన ఈడీ

ఐఏఎస్‌ జ్ఞానేంద్ర, బ్రోకరు బసవరాజు అరెస్టు

పరప్పన జైలు నుంచి తరలించిన ఈడీ

శాంత ఇంటిలో సీఐడీ సోదాలు

కేపీఎస్‌సీ ఉద్యోగాల బాగోతంలో ప్రముఖ నిందితురాలు, కేపీఎస్‌సీ సభ్యురాలు శాంత హొసమనికి చెందిన దావణగెరె నివాసంపై సీఐడీ అధికారులు దాడి చేశారు. తరళుబాళు లేఔట్‌లో ఆమెకు సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఇంటి డోర్‌ లాక్‌చేసి ఉండటంతో బలవంతంగా తాళం తీసి ప్రవేశించారు. కుంభకోణం తాలూకు ఫైళ్లు, రికార్డులు, నగదు తదితరాల కోసం వెతికారు. ప్రతి గది, అల్మరా, బీరువాలు తదితరాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 8 నెలల నుంచి ఇంట్లో ఎవరూ లేనట్లు తెలిసింది.

దళారీ విదేశాలకు వెళ్లే యత్నం

ఉద్యోగాల స్కాం గుట్టురట్టయిన తరువాత తుమకూరు యూనివర్శిటీ సిండికేట్‌ సభ్యుడైన బసవరాజ కన్నాళే భయపడిపోయాడు. తన ఆప్త రాజకీయనేతలు కూడా కాపాడలేరని గ్రహించి దేశం విడిచిపెట్టడానికి కుట్ర రూపొందించాడు. కజకిస్థాన్‌లో నెల పాటు మకాం పెట్టడానికి వీసా తీసుకున్నాడు, ఇంతలోనే అరెస్టు కావడంతో పథకాలు పారలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement