మైసూరు: హెచ్‌ఐవి, ఎయిడ్స్ అవగాహన మాసంలో భాగంగా, జబ్బుల పరీక్షలు, చికిత్స గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కోట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం నుంచి ర్యాలీని జిల్లా ఆర్.సి.హెచ్. అధికారి డా. మహమ్మద్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ రహదారుల గుండా సాగి, నజర్‌బాద్‌లోని ఎన్‌పిసి. ఆసుపత్రికి చేరింది. వైద్య నిపుణులు, మెడికోలు పాల్గొన్నారు.
కిరాతకుల అరెస్టు
దొడ్డబళ్లాపురం: ఆస్తి గొడవలతో బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా అవరాది గ్రామంలో తండ్రీ కుమార్తెను అతని సోదరులే దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో బసప్ప, సంగప్ప, మడివాళప్ప అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డు జవాన్ రుద్రప్ప (67), కూతురు శశికళ (26) స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఉండగా దుండగులు కత్తులతో నరికి చంపారు. పోలీసులు గాలించి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేశారు.
కామపిశాచికి
20 ఏళ్ల కారాగారం
● మండ్య ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కఠిన తీర్పు
మండ్య: ముక్కుపచ్చలారని బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామపిశాచికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1.10 లక్షల జరిమానా విధించింది. మండ్య తాలూకాలోని మోడ్జకనహళ్లి గ్రామానికి చెందిన నాగేశ్ (50) దోషి. వివరాలు.. ఓ బాలికపై కన్నేసిన నాగేశ్.. ఆమె గురించి సమాజంలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడు. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడసాగాడు. దీంతో అభాగ్యురాలు గర్భవతి అయింది. ఇది తెలిసి తల్లిదండ్రులు శివళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కామాంధునిపై లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు చేశారు. కెరగోడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మంజునాథ్ కోర్టులో చార్జిషీట్ సమ ర్పించారు. ఫాస్ట్ ట్రాక్ 2వ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి.దిలీప్‌కుమార్ విచారించారు. నేరం రుజువు కావడంతో ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ హెబ్బకవాడి నాగరాజు వాదించారు.
రైతు రుణ మాఫీకి కేంద్రం నిధులివ్వాలి: డీసీఎం
తుమకూరు: రైతు రుణాలను మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి డా. జి. పరమేశ్వర అన్నారు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలోని హుళియూర్ దుర్గలో శనివారం జరిగిన ప్రజా సేవా అభియాన్ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కరువు కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారికి ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేసిందని, అయినప్పటికీ, పూర్తి రుణమాఫీ చేయాలని రైతు వర్గం నుంచి డిమాండ్ ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఒక అభ్యర్థన కూడా సమర్పించినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇంటి స్థలాల పేదలకు పంపిణీ చేస్తామన్నారు.
టూర్లలో అతి చేయొద్దు
● విద్యార్థులపై సర్కారు నియంత్రణ
యశవంతపుర: ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ విద్యార్థులు విహారయాత్రలకు వెళ్లిన సమయంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కొండలు, వాగులు, నదులు వంటి చోట్ల ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకుంటూ అపాయాలకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టూర్లకు వెళ్లాలంటే ముందు ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు తగిన సూచనలు చేయాలి. సీనియర్ అధికారుల నుంచి అనుమతులతో పాటు తల్లిదండ్రుల నుంచి ఆమోదం తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. విద్యార్థులను తప్పనిసరిగా ఉపాధ్యాయలు, అధ్యాపకులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అపాయకర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా చూడాలని తెలిపారు.


