బనశంకరి: కరావళి, మల్నాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని వయనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మైసూరు జిల్లాలో కబిని, హారంగి జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. పశ్చిమ కనుమల్లోనూ కుండపోత వానల వల్ల తుంగా, భద్ర సహా నదులు, వాగులు ఉధృతమయ్యాయి. రైతుల ముఖాల్లో సంతోషం నెలకొంది.
రైలు పట్టాలు ధ్వంసం
శనివారం రాత్రి హాసన్ జిల్లా ఎడకుమారి–శిరిబాగిలు రైలుస్టేషన్ల మధ్య పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బెంగళూరు–మంగళూరు, కరావళి, కేరళ ప్రాంతాలకు రైళ్లసేవలకు ఆటంకం ఏర్పడింది. నైరుతి రైల్వే 7 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బెంగళూరు–కోజికోడ్ ఎక్స్‌ప్రెస్‌ను హాసన్‌లో నిలిపివేశారు. హాసన్–కోజికోడ్ మధ్య రైళ్ల సంచారం బందయింది. విజయపుర–మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ కూడా హాసన్‌లో నిలిచిపోయింది. హాసన్–మంగళూరు సెంట్రల్ రైళ్లకు సైతం బ్రేక్ పడింది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో ఇల్లు కూలిపోయింది.
నదులు కళకళ
ఏకధాటి వర్షాలతో హాసన్, దక్షిణ కన్నడ, కొడగు, చిక్కమగళూరు జిల్లాల్లో నదులకు జీవకళ వచ్చింది. నేత్రావతి, గుండ్య, కపిలా, కుమారధార, ఫల్గుణి, తదితర నదులు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తున్నాయి. కావేరి ప్రవాహంతో కొడగు జిల్లా భాగమండల మునిగిపోయింది. శృంగేరి క్షేత్రాన్ని తాకుతూ తుంగా నది ప్రవహిస్తోంది.
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు
ప్రమాదకరంగా నదులు
రైలు పట్టాలపై కూలిన బండరాళ్లు
పలు ప్రాంతాలకు రైళ్లు బంద్


