శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణంలో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. 15వ వార్డులో ఒక రేకుల షెడ్డు ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిద్రలోనే దుర్మరణం చెందారు. కూలీ కుటుంబం మల్లికార్జున (35), భార్య నాగవేణి (28), కుమారుడు సంతోష్ (3)గా గుర్తించారు. పక్క షెడ్డులోని ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాకు చెందిన వీరు కూలీ పనుల కోసం ఇక్కడికి వలస వచ్చి కొండ అంచుల్లో షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. నాలుగురోజులుగా వస్తున్న వానలకు కొండ రాళ్లు, మట్టి జారి షెడ్లపై పడ్డాయి. గంట సేపటి తరువాత పోలీసులు, ఫైర్, అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కూలీల షెడ్డుపై పడిన కొండచరియలు
భార్యభర్తలు, కుమారుడు మృతి
శివమొగ్గ జిల్లాలో విషాదం


