బొమ్మనహళ్లి: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హొసకోటె దగ్గర తావరకెరె గ్రామంలో ఏడు కలశాల కరగ మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. గ్రామ దేవతలైన గంగమ్మ, యల్లమ్మ, సప్పలమ్మ, పాతాళమ్మ ఆలయాలలో పూజలు చేశారు. సప్త కలశాల కరగ మహోత్సవం సందర్భంగా, దేవతల ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు దీప హారతులు తీసుకువచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రామాలయంలో హుండీ దగ్ధం
మైసూరు: జిల్లాలోని సాలిగ్రామ తాలూకా, చుంచనకట్టేలో ఉన్న ప్రఖ్యాత శ్రీరామ ఆలయంలోని హుండీలో అగ్నిప్రమాదం సంభవించి, వేలాది రూపాయలు కాలిపోయాయి. ఆలయం లోపల రెండు వైపులా ఇనుప పెట్టెల వంటి హుండీలు ఉన్నాయి. వాటిలో ఒకటి మంటలు అంటుకుని భక్తులు సమర్పించిన డబ్బు కాలిపోయింది. భక్తులు ఆలయంలో నిమ్మ దీపం వెలిగించి పూజలు చేస్తుండగా, ప్రమాదవశాత్తు హుండీలో పడినట్లు తెలుస్తోంది. అర్చకులు, భక్తులు మంటలు ఆర్పివేసి, ఆ హుండీలోని డబ్బును లెక్కించగా, అందులో రూ. 1,32,020 నగదు ఉంది, అందులో రూ. 6,270 విలువైన నోట్లు కాలిపోయినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
కూలిన ఇటుకల బట్టీ, ముగ్గురు కూలీల మృతి
మైసూరు: జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని బుడహళ్లి గ్రామంలో కాల్చిన ఇటుక బట్టీ కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. అదే గ్రామానికి చెందిన రాజేష్ (32), నాగరాజు (62), బసవయ్య నారాయణ్ (53) మృతులు. సిద్ధరాజు అనే వ్యక్తి ఈ ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. పచ్చి ఇటుకలను కాల్చిన తర్వాత, మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు కూలీలు వేచి చూస్తారు. కానీ మంటలు పూర్తిగా ఆరిపోకముందే బట్టీని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఇటుకల బట్టీ కూలీల మీద పడిపోవడంతో తీవ్ర కాలిన గాయాలతో మృత్యువాత పడ్డారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన సంభవించింది. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, టి.నరసిపుర పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ముగ్గురు కార్మికులు నిరుపేదలు, వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. యజమాని నిర్లక్ష్యం ముగ్గురిని బలిగొందని వాపోయారు.
లీకేజీ అని
పోలీస్ పరీక్షార్థుల ధర్నా
● విజయపుర జిల్లా తికోటాలో ఘటన
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం 4 వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు ఆదివారం రాత పరీక్షను నిర్వహించింది. అయితే విజయపుర జిల్లా తికోటా తాలూకాలో ప్రశ్నాపత్రం లీక్ అయిందని అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం పరీక్ష ప్రారంభం కాగానే అభ్యర్థులకు పంపిణీ చేసిన ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్ నంబర్లు విరుద్ధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. లీక్ అయ్యిందని ఆరోపిస్తూ అభ్యర్థులు పరీక్షలను బహిష్కరించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. గేట్ ముందు గుమిగూడి ప్రభుత్వం, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. పోలీస్ ఉన్నతాధికారులు, కలెక్టరు తదితరులు వచ్చి పరిశీలించారు. లీకేజీ కాదంటూ ఆందోళనకారులకు నచ్చజెప్పారు.


