● ఆశావహుల్లో టెన్షన్
సాక్షి, బెంగళూరు: కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమోదం లభించినట్లు, సోమవారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణం జరగనున్నట్లు సమాచారం. లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదని లోక్‌భవన్ వర్గాల సమాచారం. దీంతో స్వీకారానికి ఏర్పాట్లు ఏవీ కనబడడం లేదు. ఆశావహుల్లో ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనే గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే సోమవారం కేబినెట్ విస్తరణ ఉంటుందని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. సీఎం డీకే శివకుమార్ నుంచి ఏ సూచనలు రాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు కసరత్తు సాగిస్తున్నారు. కొందరి ఎంపికపై ఉమ్మడి అంగీకారం లభించలేదని తెలిసింది. అందుకే ఆలస్యమైనట్లు సమాచారం. సోమవారం ఉదయం 10 గంటలకు జాబితా డీకే శివకుమార్‌కు అందవచ్చని ఆశావహులు చెబుతున్నారు. ఒకవేళ నేడు జరగకపోతే బుధవారం తథ్యమనే వార్తలున్నాయి.
ఊపిరి తీసిన కుర్‌కురే
మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని గౌరీపురలో కుర్‌కురే చిరుతిండ్ల ప్యాకెట్ బాలుని ప్రాణాల్ని తీసింది. సంతోష్–ఐశ్వర్య దంపతుల ఏకైక కుమారుడు ముకుంద మయూర్‌కు అంగడిలో బంధువుల పిల్లలు కుర్ కురే ప్యాకెట్‌ను కొనిచ్చారు. ఆ ప్యాకెట్లలో తినుబండారాలతో పాటు చిన్న బొమ్మ కూడా ఉంటుంది. ఆ ప్యాకెట్లో ప్లాస్టిక్ బంతి ఉంది, అది కూడా తినే వస్తువని బాలుడు మయూర్ దానిని నోట్లో పెట్టుకుని మింగాడు. ఆ బంతి అతని గొంతులో ఇరుక్కుపోవడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారిలోనే చనిపోయాడు.
పోలీసమ్మలు
బనశంకరి: పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్షకు 8 నెలల పసికందుతో వచ్చిన మహిళా అభ్యర్థికి మహిళా పోలీసులు సాయం చేశారు. బెంగళూరు సీకే అచ్చుకట్టు ఠాణా పరిధిలోని కృష్ణా కాలేజీకి ఓ పసికందు తల్లి పరీక్ష రాసేందుకు వచ్చింది. బిడ్డను తీసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో మహిళా పోలీసులే ఊయల కట్టి శిశువును అందులో ఉంచి నిద్రపుచ్చారు. దీంతో మహిళా అభ్యర్థి సజావుగా పరీక్ష రాసింది. పసికందు గట్టిగా ఏడవగా, పోలీసులు ఓర్పుగా ఊయల ఊపి సముదాయించారు.


