కావేరి గొడవకు మేకెదాటే జవాబు | - | Sakshi
Sakshi News home page

కావేరి గొడవకు మేకెదాటే జవాబు

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

శివాజీనగర: కావేరి జలాల పంపకంలో కర్ణాటక ప్రయోజనాలకు, ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ అన్నారు. కావేరి సమస్యపై బంద్‌ వద్దని పార్టీలు, సంఘాలకు సూచించారు. తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని వదలాలని కావేరి జల అథారిటీ ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం ఆయన తన నివాసం కృష్ణాలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం జరిపారు. మాజీ సీఎంలు యడియూరప్ప, సిద్దరామయ్య, సదానందగౌడ, కేంద్రమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, శోభా కరంద్లాజె, సోమణ్ణ, పెద్దసంఖ్యలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. కావేరి వివాదం మనకు కొత్తేమీ కాదు. వాటి మధ్యనే పెరిగామని సీఎం అన్నారు. సమావేశంలో సీఎం తన వాదనలను వినిపించారు. కావేరి కమిటీల ఆదేశాలకు ముందు కేంద్ర నేతలకు పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. సాగునీరు, తాగునీటి కొరత ఉన్న ఈ తరుణంలో సమైక్య పోరాటం మాత్రమే రాష్ట్రానికి న్యాయం చేకూర్చగలదని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మేకెదాటు ఉపయుక్తం

రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని సీఎం తెలిపారు. మేకెదాటు ప్రాజెక్ట్‌ డీపీఆర్‌కు ఎలాంటి సాంకేతిక సమస్య లేదు, చిన్న అంశాల వల్ల పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో 9 టీఎంసీల నీటిని తాగునీటికి కేటాయించినట్లు చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును నిర్మిస్తే, దాని ప్రయోజనాల్లో సుమారు 90 శాతం తమిళనాడుకే దక్కుతాయని సీఎం తెలిపారు.

విజయ్‌ మంచి లీడర్‌

3న జరగాల్సిన తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్‌ పర్యటన వాయిదా పడింది, కర్ణాటకలో నెలకొన్న భావోద్వేగ వాతావరణం దృష్ట్యా వాయిదా వేసుకోవాలని ఆయనను కోరానని, అంగీకరించారని తెలిపారు. విజయ్‌ అంటే నాకు గౌరవం, రాజకీయాలకు కొత్త అయినప్పటికీ, ఆయన ధైర్యవంతుడైన నాయకుడు అని సీఎం కొనియాడారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికి, మనం కలిసి జీవించాలి, కలిసి పనిచేయాలని అన్నారు.

ఆదివారం బెంగళూరులో సీఎం నివాసంలో అఖిల పక్ష సమావేశం

మేకెదాటు వద్ద కావేరి నది

రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం

కావేరి అఖిలపక్ష భేటీలో సీఎం డీకే శివ

తమిళనాడు సీఎం విజయ్‌ రాక వాయిదా

రాష్ట్ర బంద్‌ వద్దని సీఎం సూచన

బంద్‌ చేయకండి

కర్ణాటక బంద్‌ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, అఖిలపక్ష సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరిందని సీఎం చెప్పారు. బంద్‌ వద్దని కన్నడ సంఘాలకు, రైతు సంఘాలను కోరుతున్నట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం మార్గదర్శనాలు ఇచ్చేవరకు సహనంతో ఉండాలని కోరారు.

డ్యాం నిండడం వల్లనే విడుదల

కబిని డ్యాం పూర్తిగా నిండిపోయింది, భద్రతా కారణాల దృష్ట్యా శనివారం మధ్యాహ్నం నుంచి నీటిని విడుదల చేశామని సీఎం చెప్పారు. అఖిలపక్ష భేటీ తరువాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ జలాశయం నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయలేదన్నారు. కావేరి ప్రాంతవాసిగా ఏడున్నర కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కావేరి జలాల కోసం న్యాయపోరాటం కొనసాగుతోందని, చట్టాన్ని గౌరవించి, కోర్టు ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరువు అధికమవుతోందని, ఈ నెలలో స్పష్టమైన చిత్రం లభిస్తుందన్నారు. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement