సాక్షి, బళ్లారి: కలబుర్గి జిల్లాలో లంబాణి గిరిజనులు వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు అంటూ ఆదర్శ తీర్మానం చేశారు. వరకట్నం మహిళ కుటుంబాలను పట్టిపీడిస్తున్న నేపథ్యంలో వరకట్నం లేకుండా పెళ్లిళ్లు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. సమాజంలో వరకట్నం కారణంగా పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆడబిడ్డలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు అప్పులపాలవుతున్న సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాండాల్లో జరిగే వివాహాల్లో ఎవరైన వరకట్నం కోరితే లేదా ఇస్తే సామాజికంగా బహిష్కరించడం వంటి చర్యలు తీసుకుంటామని పెద్దలు హెచ్చరించారు. మహిళ గౌరవం, సమానత్వం ఆర్థిక భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అని చర్చించారు. తల్లిదండ్రులు చట్టపరంగా ఆడపిల్లకు ఇవ్వాల్సిన ఆస్తి ఇతరత్ర వాటిని ప్రేమతో ఇస్తారు. అయితే బలవంతంగా వరకట్నం రూపేణ తీసుకోకూడదన్నారు. వరకట్నం అడిగితే సామాజిక బహిష్కరణ చేస్తామని చెబుతున్నారు. ఇకపై లాంబాణి సమాజంలో జరిగే వివాహాల్లో వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం పూర్తిగా నిషేధించాలని తాండాల పెద్దలు, మహిళలు తీర్మినించారు. పెళ్లి పేరుతో అమ్మాయి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం అన్యాయం. దీని వల్ల చాలా పేద కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాయి. నిరాడంబర వివాహాలు జరిపి, ఆడంబరాలకు దూరంగా ఉండాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం కేవలం ఒక గ్రామానికే పరిమితం కారాదని తెలిపారు.
కలబుర్గి జిల్లాలో
లంబాణి గిరిజనుల ఆదర్శ తీర్మానం
ఆడంబరాలు,
అప్పుల భారం అడ్డుకట్ట దిశగా అడుగు
నిబంధనలు ఉల్లంఘిస్తే
సామాజిక బహిష్కరణ


