చింతామణి: పట్టణంలోని పురాణ ప్రసిద్ధ శ్రీనాగ నాథేశ్వర దేవస్థానంలో స్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. పండితులు అభిషేకం, హోమాలు, అలంకారం నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు దర్శించుకొన్నారు.
మహిళ కంట్లో కారం చల్లి రూ.5 లక్షల దోపిడీ
కోలారు: ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంఘాల నుంచి వసూలు చేసిన రుణాల డబ్బు రూ.5 లక్షలను పట్టపగలే దొంగలు దోచుకుని వెళ్లిన ఘటన ముళబాగిలు నగరంలోని షామీర్ మొహల్లాలో ఉన్న సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధికారి శశికళ రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతుండగా, ఇద్దరు అపరిచితులు ఆఫీసులోకి చొరబడ్డారు. వెంటనే శశికళ కళ్లలోకి కారం పొడి చల్లి, చాకు చూపించి బెదిరించి ఆ నగదును ఎత్తుకుని వెళ్లారు. బాధితురాలు కేకలు వేసేటప్పటికి పరిసరాల్లో లేరు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో ఆధారాల కోసం ప్రయత్నించారు.
నిద్రిస్తున్న వారిపై సైకో దాడి
దొడ్డబళ్లాపురం: వేసవి వేడిని తట్టుకోలేక ఇంటి ముందు పడుకున్న వారిపై సైకో కట్టెతో బాదగా ఆరుమంది గాయపడ్డ సంఘటన గదగ్ జిల్లా ముండరగి తాలూకా డోణి తాండాలో జరిగింది. మంగళవారం రాత్రి తాండాలో కొందరు ఇళ్ల ముందు మంచం వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్రామవాసి, మానసిక రోగి హర్జప్ప లమాణి లావుపాటి కట్టె తీసుకుని పడుకున్నవారిని చావబాదాడు. ఎగ్గప్ప నాయక్, శేఖప్ప నాయక్, షణ్ముఖప్ప, జగదీష్ లమాణి, చవళ్ళప్ప లమాణి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వారిని ఆస్పత్రికి తరలించారు. ముండరగి పోలీసులు దుండగున్ని అరెస్టు చేశారు. హర్జప్ప మానసిక అస్వస్థుడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనతో బయట పడుకోబోమని చాలామంది తెలిపారు.
ఎయిర్‌పోర్టులో
భారీగా డ్రగ్స్ సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగ్‌లో రహస్యంగా దాచిన 9.7 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు, దీని విలువ రూ.3.39 కోట్లుగా తెలిపారు. మరో ప్రయాణికుడు చాక్లెట్లలో దాచిన 1.7 కేజీల చరస్, హషిష్ మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి ఖరీదు రూ.4.7 కోట్లుగా తెలిపారు. నిందితులను అరెస్టు చేశారు.
ప్రేయసి ఆత్మహత్య, ప్రియుడు సైతం..
దొడ్డబళ్లాపురం: ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందన్న ఆవేదనతో ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. పవిత్ర (19), కార్తీక్ (19) ఆ ప్రేమ జంట. పవిత్ర బనహట్టి నివాసి కాగా, కార్తీక్ అస్కి గ్రామం నివాసి. ప్రేమించుకుంటున్న వీరు ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన పవిత్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలిసి కార్తీక్ కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


