శివాజీనగర: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న దావణగెర దక్షిణ, బాగల్‌కోటె అసెంబ్లీ క్షేత్రాల ఉప ఎన్నికల పోలింగ్ నేడు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనుంది. బుధవారం రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు రావడం తెలిసిందే. దావణగెరెలో కాంగ్రెస్, బీజేపీతో పాటు 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 284 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రాల్లో సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్, అలాగే బీజేపీ అగ్రనేతలు ప్రచారం సాగించారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఇతర సామగ్రితో కేంద్రాలకు బయల్దేరారు.
ఉత్తుత్తి స్థలం పత్రాలతో
రూ.38 లక్షల రుణం
మైసూరు: రాచనగరి మైసూరులో స్థలం లేకున్నా నకిలీ పత్రాలను బ్యాంకులో అందించి రూ.లక్షలాది రుణం తీసుకుని మోసగించే ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. ఇలాగే ఘరానా దంపతులు ఉత్తుత్తి స్థలం కుదువపెట్టి రూ.38 లక్షలు కొట్టేశారు. మైసూరు జిల్లా కేఆర్‌నగర తాలూకా సరుగూరు నివాసులు హెచ్‌ఎస్ మహేష్, అతని భార్య సీహెచ్ రేణుక, వారి బంధువు మీనాక్షి అనే వారిపై ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు మైసూరులోని కువెంపునగర స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు తమకు స్థలం ఉందని, దాని మీద రుణం కావాలంటూ కొన్ని పత్రాలు ఇచ్చి రూ.38 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఒక్క కంతు కూడా చెల్లించలేదు. బ్యాంకు అధికారులు స్థల దాఖలాలను పరిశీలించగా, అవి నకిలీవని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిళిగిరి బెట్టపై కార్చిచ్చు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా బిళిగిరి రంగనబెట్ట పులి అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగింది. చిక్కరంగశెట్టి దొడ్డి శివార్లలో అగ్గి పడి 50–60 ఎకరాల అటవీ భూమి కాలి బూడిదైంది. సరీసృపాలు, పక్షులు ఆహుతయ్యాయి. అటవీ శాఖాధికారులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే ఎండిన పొదలు, గడ్డి పెద్ద ఎత్తున మండడంతో ఆర్పడం కష్టంగా మారింది. దీంతో దావానలం మరింత వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ అడవుల్లో మంటలు వ్యాపించడం మామూలైంది.
మాజీ భర్తకు దక్కని ఊరట
శివాజీనగర: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు.


