వీధి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని ఒకటో వార్డ్‌ బస్టాండ్‌ సమీపంలో మూడేళ్ల బాలికతో సహా ఐదుగురిపై మంగళవారం వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుక్క వీధిలో కనిపించిన వారిని కరవడంతో ప్రజలు భయపడ్డారు. గాయపడిన వారికి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కల బెడదపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలో సంచరిస్తున్న కుక్కలకు వెంటనే సంతాన హరణ శస్త్రచికిత్స చేసి, పునరావాసం కోసం వేరే చోటికి తరలించాలని, ఈ విషయంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

బ్యారేజీలోకి చేప పిల్లల విడుదల

రాయచూరు రూరల్‌ : చేపలను పెంచి వాటి సంరక్షణకు మత్స్యకారులు ముందుకు రావాలని బెళగావి మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బెళగావి జిల్లాలో భీమా నదిపై నిర్మించిన హింగణి బ్యారేజీలో చేప పిల్లలను వదిలిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయపుర జిల్లా చడచణ తాలూకా చణగావ్‌లో కూడా చేప పిల్లలను వదిలామన్నారు. ఈసందర్భంగా అధికారులు బాంగి సురగిహళ్లి, గంగణ్ణ పూజారిలున్నారు.

హోంగార్డ్స్‌ కమాండెంట్‌గా దీపా

రాయచూరు రూరల్‌ : రాయచూరు హోంగార్డ్స్‌ కమాండెంట్‌గా దీపా నియమితులయ్యారు. మంగళవారం హోంగార్డ్స్‌ కమాండెంట్‌ కార్యాలయంలో ఆమె అధికార బాధ్యతలు చేపట్టారు. గత ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టులో దీపాను కమాండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. జిల్లాలో అన్ని రకాల కార్యక్రమాలకు హోంగార్డులను రక్షణ కవచంగా నిలుపుతామన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హరీష్‌ ఆమెను అభినందించారు.

అకాడమి సభ్యుడిగా నియామకం

రాయచూరు రూరల్‌: రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం అకాడమి సభ్యుడిగా డాక్టర్‌ జేఎల్‌ ఈరణ్ణను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి హరిజనవాడలో జనసేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సమాజం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.

వైభవంగా

శయనోత్సవ వేడుకలు

కోలారు: తాలూకాలోని యల్దూరు గ్రామంలో ఉన్న కోదండ రామస్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శయనోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. దేవాలయ ప్రధాన అర్చకుడు వై.ఆర్‌.రామకృష్ణమాచార్‌, వై.ఆర్‌.శేషాద్రి, తిరుమల తిరుపతి దేవాలయం అర్చకులు వై.ఆర్‌.రామచంద్రాచార్‌ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అంతకుముందు శయనోత్సవం సందర్భంగా స్వామిని పూలమాలలతో అలంకరించారు. అనంతరం ఉయ్యాలలో కోదండ రాముడిని కొలువుదీర్చి శయనోత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగరత్నమ్మ, మలగానహళ్లి రెడ్డెప్ప బృందంతో హరికథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు.

కేబుల్‌ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌

కేజీఎఫ్‌: బేతమంగల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన బోరువెల్‌ కేబుల్‌ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 వేల విలువ చేసే 310 మీటర్ల కేబుల్‌, చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 30న శ్రీనివాసపుర గ్రామానికి చెందిన నారాయణప్ప తన పొలంలో 410 మీటర్ల కేబుల్‌ చోరీ జరిగినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. బేడమాకనహళ్లి గ్రామానికి చెందిన చలపతి, బాబును అరెస్టు చేశారు. నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement