● హుణసూరు డ్రగ్స్ ఫ్యాక్టరీ కేసు..
మైసూరు: జిల్లాలోని హుణసూరు రత్నపురి సమీపంలోని దాసనపుర తోటలోని ఒక ఇంట్లో డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రంలో కోట్ల రూపాయల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట పట్టుబడిన నిందితుల ఫోన్లను తనిఖీ చేయగా వీరి జాడ తెలిసింది. ఇద్దరు ముంబైలో, మరొకరు ఒడిశాలోని కటక్‌లో ఉన్నట్లు గుర్తించి పట్టుకొచ్చారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. రాజా సహాని అనే ముఖ్య నిందితున్ని మైసూరుకు తీసుకువస్తున్నారు. హుణసూరులో 7.35 కేజీల మెఫెడ్రిన్, 41 కిలోల ముడిసరుకులు లభించాయి. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. ఇప్పుడు వచ్చిన నివేదికలో అవి నిజమైన మత్తు పదార్థాలని రుజువైందని పోలీసులు తెలిపారు.
బాలునిపై కుక్క దాడి..
యజమానిపై కేసు
యశవంతపుర: బాలున్ని వేరేవారికి చెందిన పెంపుడు కుక్క కరిచిన ఘటన బెంగళూరు రాజాజీనగరలో జరిగింది. బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడు (11) బ్రెడ్ తేవాలని సైకిల్‌పై బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తుండగా, ఆ కుక్క బాలున్ని కరిచింది. కుక్క యజమాని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. బాలునికి ఎలాంటి సాయం చేయకుండా, వైద్యం గురించి మాట్లాడలేదు. బాలుని కుటుంబం సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి కుక్క యజమానికి విచారణా నోటీసులిచ్చారు.
ప్లైవుడ్ షాపు దగ్ధం,
ఆవులు మృతి
యశవంతపుర: బెంగళూరు డీజే హళ్లి పోలీసుస్టేషన్ పరిధిలోని శాంపుర రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఓ ప్లైవుడ్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కలో ఉన్న పశువుల షెడ్‌కు మంటలు వ్యాపించాయి. దీనితో ఆరు ఆవులు సజీవ దహనమయ్యాయి. అనేక పశువులు గాయపడ్డాయి. వ్యాపారి మహమ్మద్ తాళం వేసుకొని వెళ్లగా, కొన్ని గంటల తరువాత మంటలు వ్యాపించాయి. క్షణాల్లో అంగడి కాలిపోయింది. షాపు ముందు నిలిపిన టాటా ఏస్ వాహనంతో పాటు 4 బైకులు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
గ్యాస్ కోసం అష్టకష్టాలు
● తుమకూరు జిల్లాలో కటకట
తుమకూరు: తుమకూరు నగరంతో పాటు జిల్లాలో ఆటోలకు, వాహనాలకు ఎల్‌పీజీ, సీఎన్జీ గ్యాస్ దొరకడం లేదు. కల్పతరునాడులో అనేక ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లు మూతపడ్డాయి. మిగిలిన కొన్ని స్టేషన్లలో కూడా ఆటో గ్యాస్ ధర రెట్టింపు అయింది. చాలామంది ఆటో డ్రైవర్లు బాడుగకు తీసుకుని ఆటోలను నడుపుతారు, రెట్టింపు ధరకు గ్యాస్ నింపుకోలేక, ఆటోలు నడపకుండా ఊరికే కూర్చోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఆటోచార్జీలను పెంచితే గిరాకీలు దొరకరని వాపోయారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తొలగిపోయే వరకు గ్యాస్ కొరత కొనసాగుతుందని చాలామంది ఇంధన వ్యాపారులు చెప్పడంతో ఆటోవాలాలు నిరాశలో మునిగిపోయారు. భద్రమ్మ సర్కిల్, బార్‌లైన్ రోడ్, గుబ్బి గేట్, శిర గేట్, ఎల్లాపుర సహా నగరంలోని ప్రధాన ఆటో గ్యాస్ స్టేషన్లను మూసివేశారు. ఒకటి రెండు బంకులు పనిచేస్తుంటే, గంటలకొద్దీ క్యూలో నిలబడవలసి వస్తోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలి. లేకపోతే తమ జీవితం దుర్భరమవుతుందని ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ల డ్రైవర్లు చెప్పారు.


