గవర్నర్‌ను తిప్పిపంపాలి | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను తిప్పిపంపాలి

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

తుమకూరు: కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు, నాయకులు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ద్విభాషా విద్యా విధానం అమలును అడ్డుకునేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలవాలని మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. కన్నడ విరోధి గవర్నర్‌ను వాపసు పంపాలని నినాదాలు చేశారు. జిల్లాధికారిణి శుభ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు.

పలు జిల్లాల్లో

లోకాయుక్త పంజా

మైసూరు: లోకాయుక్త అధికారులు మైసూరులోని ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఏఈ రేవన్న చాంబర్‌లో సోదాలు జరిపారు. డీఎస్పీ వెంకటేష్‌ ఆధ్వర్యంలో తనిఖీలు సాగాయి. అలాగే చిత్రదుర్గలో నిర్మితి కేంద్రం గణాంక అధికారిణి, బళ్లారిలో మత్స్యశాఖ అధికారి ఇల్లు, ఆఫీసులో దాడులు జరిగాయి. అక్రమాస్తులు, లంచాల ఆరోపణలే కారణమని తెలిసింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, డబ్బు, స్థిరాస్తుల సమాచారం లభ్యమైనట్లు తెలిసింది.

బీసీ సంక్షేమ అధికారిణిపై

లోకాయుక్త దాడులు

శివమొగ్గ: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి కేఆర్‌ శోభ ఇంటితో సహా పలుచోట్ల లోకాయుక్త అధికారులు ఆకస్మిక సోదాలు ప్రారంభించారు. శివమొగ్గ, శికారిపుర, సాగర్‌తో సహా మొత్తం ఐదుచోట్ల దాడులు చేపట్టారు. ఆమె వ్యక్తిగత సహాయకుని ఇంటికి కూడా వెళ్లారు. దావణగెరె లోకాయుక్త ఎస్పీ నాయకత్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారని, లంచాలు తీసుకోనిదే ఏ పనీ చేయడం లేదని శోభపై ఫిర్యాదులు వెళ్లడంతో లోకాయుక్త కార్యాచరణకు నాంది పలికినట్లు సమాచారం.

110 మొబైళ్ల రికవరీ

యశవంతపుర: బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు దొంగతనాలకు గురైన మొబైల్‌ ఫోన్లను పెద్దసంఖ్యలో ఛేదించారు. రూ.22 లక్షల విలువగల 110 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు ఉత్తర విభాగం పరిధిలో చోరీకి గురైనవే. బాధితులు ఫోన్‌ పోయిన వెంటనే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా గాలించి ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇండక్షన్‌ స్టవ్‌లకు గిరాకీ

దొడ్డబళ్లాపురం: ఇరాన్‌– ఇజ్రాయెల్‌, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మనదేశంలో వంట గ్యాస్‌కు కటకట ఏర్పడింది. ఇక బెంగళూరులోనూ అన్ని వర్గాలూ అవస్థలు పడుతున్నాయి. గ్యాస్‌ స్టవ్‌లకు బదులుగా ఇండక్షన్‌ స్టవ్‌ల వాడకం పెరిగింది. మార్కెట్‌లో ఈ రకం స్టవ్‌లు అన్నీ అమ్ముడుపోవడంతో పాటు అడ్వాన్స్‌ బుకింగ్‌లు జరిగాయి. దుకాణదారులు స్టవ్‌ల కోసం ఫ్యాక్టరీలపై ఒత్తిడి తెస్తున్నారు. బెంగళూరు పీణ్యలోని కర్మాగారాల్లో వీటి ఉత్పత్తి కోసం కార్మికులు పగలు, రాత్రి పని చేస్తున్నారు.

నదిలోకి దూకి

నర్సు ఆత్మహత్య

యశవంతపుర: ఓ నర్సు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా ముడుబ గ్రామం వద్ద జరిగింది. మృతురాలు రన్యా బేసిల్‌ (30)గా గుర్తించారు. ఆమె ఎన్‌ఆర్‌ పుర తాలూకా ముత్తినకొప్పకు చెందినవారు కాగా, శివమొగ్గలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. సోమవారం ఆమె డ్యూటీ చేసి ఇంటికి వచ్చింది. తరువాత నది వద్దకు వెళ్లి వంతెన మీద నుంచి దూకడంతో ప్రాణాలు పోయాయి. 12 ఏళ్ల క్రితం వివాహమైన రన్యకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కాఫీ తోట సాగు చేస్తున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement