సాక్షి,బళ్లారి: ప్రేమించిన అమ్మాయి తనకు దగ్గర కాలేదని ఓ యువకుడు ప్రాణ త్యాగం చేశాడు. ముందుగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆ ప్రకారం తన బుల్లెట్ బైక్‌పై వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన ఘటన విజయపుర జిల్లా సింధగి తాలూకా టోల్‌గేట్ సమీపంలో జరిగింది. వివరాలు.. అల్లాపుర లేఅవుట్‌కు చెందిన అభిషేక్(19) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ సఫలం కాకపోవడంతో పిచ్చివాడయ్యాడు. ఆ యువతి లేకుంటే తాను జీవించలేననే మనస్తాపంతో బైక్‌పై వేగంగా వెళుతూ ఆర్‌టీసీ బస్సును ఢీకొన్నాడు. బస్సు డ్రైవర్‌కు ఏం జరుగుతోందో తెలిసేలోపు క్షణాల్లో ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. వేగంగా వస్తున్న బస్సుకు అతివేగంగా బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ముందుగా ద్విచక్ర వాహనంలో మంటలు వ్యాపించాయి. వెంటనే ఆర్‌టీసీ బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో అభిషేక్ సజీవదహనం అయ్యాడు. అయితే బస్సులోని ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేసి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడారు. ఆర్‌టీసీ బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్టాలో ముందే సూసైడ్ మెసేజ్ పోస్ట్
బైక్‌పై వెళ్లి బస్సుకు ఢీకొట్టి సజీవదహనం
తృటిలో తప్పిన ముప్పు, మంటల్లో బస్సు బుగ్గి


